అనంతపురం ప్రతినిధి : అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థినుల పట్ల లైబ్రేరియన్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ తల్లిదంద్రులు ఆందోళనకు దిగారు. ఆయన వ్యవహారశైలిని తప్పుబడుతూ ప్రిన్సిపాల్ ఛాంబరులోనే దేహశుద్ధి చేశారు. సోమవారం ఉదయం పాఠశాల ప్రారంభమైన తరువాత విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న భానుప్రకాశ్ నాయక్ లైబ్రరరీ గదిలోనే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. విద్యార్థినులు ఏ రంగు లోదుస్తులు ధరించారు, వాటి బ్రాండ్లు అడగటం వంటివి చేయడమే కాకుండా మసాజ్ చేయాలని ఒత్తిడి చేయడం వంటివి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని మూడు రోజుల క్రితం కూడా ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినట్టు తల్లిదండ్రులు తెలిపారు. ఆందోళనకు దిగడంతో ప్రిన్సిపాల్ కరీం ఖాన్ భానుప్రకాశ్ నాయక్‌ను ఛాంబర్‌కు పిలిపించారు. ఈ సమయంలోనూ ఆయన బుకాయించే ప్రయత్నం చేశారు. దీంతో కొంతమంది తల్లిదండ్రులు కోపోద్రుక్తులై అతడిపై దాడి చేశారు. వివాదం జరుగుతున్న విషయం తెలియడంతో ఇటుకలపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని సద్దుమణిచే ప్రయత్నం చేశారు. చర్యలు తీసుకుంటామని చెప్పినా తల్లిదండ్రులు శాంతించలేదు. అతడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో ప్రిన్సిపాల్ కరీంఖాన్ సమాచారాన్ని కేంద్రీయ విద్యా సంఘటనను డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈనెల 16వ తేదీన దీనిపై విచారణ బృందాన్ని పంపించి చట్టపరమైన చర్యలు భానుప్రకాశ్‌పై తీసుకుంటామని హామీనిచ్చారు.
గతంలోనూ భాను ప్రకాశ్‌పై ఆరోపణలు
భానుప్రకాశ్‌పై గతంలోనూ ఆరోపణలున్నాయి. గుత్తి కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తున్న సమయంలోనూ ఇదే రకమైన ఆరోపణలొచ్చాయి. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టడంతో ఆయన్ను అక్కడి నుంచి అనంతపురం కేంద్రీయ విద్యాలయంకు బదిలీ చేశారు. ఇక్కడా ఇదే రకమైన చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలొచ్చాయి.
తల్లిదండ్రులు పిర్యాదు ఇదే మొదటి సారి : కరీం ఖాన్, ప్రిన్సిపాల్
లైబ్రేరియన్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్న విషయాన్ని గతంలో తల్లిదండ్రులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. మొదటిసారి ఇదేనని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించడం జరిగిందన్నారు. విచారణకు కమిటీని నియమించారన్నారు. కమిటీ నివేదిక అనంతరం భానుప్రకాశ్‌పై చట్టపరమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు.
విద్యార్థి సంఘాలు ఆందోళన
విద్యార్థినుల పట్ల లైబ్రేరియన్ భానుప్రకాశ్ అసభ్య ప్రవర్థనను నిరిసిస్తూ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. వైఎస్‌ఆర్ విద్యార్థి సంఘం, ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, టిఎన్‌ఎస్‌ఎస్ తదితర విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద నిరసన చేపట్టాయి. భానుప్రకాశ్‌ను వెంటనే సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.










