ప్రజాశక్తి-నార్పల విద్యార్థినులకు నాణ్యమైన వేడి వేడి భోజనాన్ని అందించాలని ఇన్‌ఛార్జి జిల్లా వైద్యాధికారిణి సుజాత సూచించారు. మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో సోమవారం సాయంత్రం విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ప్రజాశక్తి దినపత్రికలో 'విద్యార్థినులకు అస్వస్థత.. నార్పల ప్రాథమిక వైద్యశాలలో చికిత్స' అని ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన జిల్లా వైద్యాధికారిణి సుజాత మంగళవారం హాస్టల్‌కు చేరుకుని ఘటనపై ఆరాతీశారు. అనంతరం వసతిగృహంలో కలియతిరిగి వంటశాల, పరిసరాలు, ఆహార పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంటశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆహారాన్ని వేడివేడిగానే వడ్డించాలన్నారు. వండిన తర్వాత ఎక్కువ సమయం నిలువ ఉంచుకోకూడదన్నారు. అన్నం చల్లగైన తర్వాత పెడితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కావున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అదేవిధంగా మండలంలోని అన్ని పాఠశాలలు, హాస్టళ్లలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఉండాలని మండల వైద్యాధికారులకు సూచించారు. అనంతరం బొందలవాడలో నిర్వహించిన ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయని గ్రామీణ ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత రికార్డులను పరిశీలించారు. అలాగే బి.పప్పూరు ప్రాథమిక వైద్యశాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక వైద్యులు రవిశంకర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ షహంతాజ్, నార్పల ప్రాథమిక వైద్యశాల వైద్యులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ సాదియా, సిహెచ్‌ఓ బాలాజీ, సూపర్‌వైజర్ అక్కులప్ప, పప్పూరు ఎంపిహెచ్‌ఒ మల్లికార్జున సూపర్‌వైజర్ శ్రీరాములు, ఎంపిహెచ్‌ఇఒ సుబ్రమణ్యం, ఏఎన్‌ఎంలు, వైద్యసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న వైద్యసిబ్బంది










