Apr 06,2023 21:40

మాట్లాడుతున్న ఏపీ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంబా రవిబాబు

ప్రజాశక్తి-చిలమత్తూరు       లేపాక్షి మండలం టేకులోడు గురుకులంలో గత నెల 29వ తేదీన 8వ తరగతి చదువుతున్న విధ్యార్థిని మహిత మృతిపై ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంబా రవిబాబు పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌ ఆధ్వర్యంలో స్థానిక మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల వసతి గృహంలో గురువారం విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా అనేక విషయాలు బట్టబయలు కావడంతో ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కుంబా రవిబాబు అధికారుల తీరుపై మండిపడ్డాడు. మొదట గురుకుల సిబ్బంది, విద్యార్థులు తల్లిదండ్రులను విచారించారు. కమిషన్‌ వేసిన ప్రశ్నలకు సిబ్బంది సమాధానం ఇవ్వలేకపోయారు. విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. విచారణ అనంతరం కుంబా రవిబాబు మీడియాకు పలు విషయాలను వెల్లడించారు. అనారోగ్యం పాలైన విద్యార్థిని పట్ల ఎఎన్‌ఎం, క్లాస్‌ ఇన్‌ఛార్జి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అలాగే పీఈటీ అనారోగ్యంతో ఉన్న విద్యార్థినితో మైదానంలో రౌండ్‌లు కొట్టించి బాలిక అరోగ్యం మరింత క్షీణించడానికి కారణం అయిందన్నారు. 19వ తేదీ అనారోగ్యం పాలైన విద్యార్థినికి అదే రోజు తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స చేయించి హాస్టల్‌లో వదిలారన్నారు. ఆ రోజు నుండి 28వ తేదీ వరకు ఎలాంటి పర్యవేక్షణ లేదన్నారు. సిక్‌ రిజిస్టర్‌లో కూడా ఎంట్రీ లేదన్నారు. హాస్టల్‌ విద్యార్థినులు అనారోగ్యం పాలైతే ఆసుపత్రిలో చూపించాలన్నారు. అయితే ఆసుపత్రిలో చూపించకుండా విద్యార్థినిని ఇంటికి పంపడం ఉద్యోగం పట్ల సిబ్బందికి ఉన్న బాధ్యత ఎలా ఉందో స్పష్టం అవుతోందని అన్నారు. ఆ విద్యార్థినితో మరో 20 మంది విద్యార్థినులు అనారోగ్యం పాలయ్యారని మెడికల్‌ ఆఫీసర్‌ హస్టల్‌కి వచ్చి పరిశీలించేంత వరకు ఇది బయటపడలేదన్నారు. క్లాస్‌ ఇన్‌ఛార్జి విద్యార్థినుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో స్పష్టం అయిందన్నారు. విద్యార్థిని అనారోగ్యం పాలయినా కనీసం ప్రిన్సిపల్‌ దృష్టికి తీసుకుపోకుండా నిర్లక్ష్యంగా వహించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రిన్సిపల్‌ బాధ్యతా రాహిత్యం కూడా ఉన్నట్లు స్పష్టమైందన్నారు. ఇవన్నీ ఓ గిరిజన విద్యార్థిని మృతికి కారణం అయ్యాయని వెల్లడించారు. విద్యార్థిని మృతి అనంతరం కూడా సిబ్బంది, అధికారులు దారుణంగా వ్యవహరించారని అన్నారు. విద్యార్థిని మృతి అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో పలువురు బాధ్యులుగా తేలారని చెప్పారు. ఓ గిరిజన విద్యార్థిని మరణిస్తే విచారణ చేయకపోవడం, కేసు నమోదు కాకపోవడం దేనికి సంకేతం అన్నారు. గురుకులాల ఏజీవో రాజేంద్ర కుమార్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌ విద్యార్థిని తల్లిదండ్రులకు రూ.50 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే, సొసైటీ సెక్రెటరీ విద్యార్థిని తండ్రికి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఆశచూపి అట్రాసిటీ కేసు నమోదు కాకుండా జాగ్రత్తపడ్డారని విచారణలో తేలిందన్నారు. ఆసుపత్రిలో ఎమ్‌ఎల్‌సి చేయకుండా, పోస్టుమార్టం చేస్తే విషయాలు బయటకు వస్తాయని మేనేజ్‌ చేశారన్నారు. పోస్టుమార్టం చేయని ఆసుపత్రి డాక్టర్‌ను కూడా బాధ్యుడిగా చేర్చాలని ఆదేశించారు. విద్యార్థిని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించాలని, మృతికి గల కారణాలపై నిగ్గుతేల్చాలని, కారకులైన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌కు సిఫార్సు చేశారు. విద్యార్థిని కుటుంబానికి రూ.8.50 లక్షలు నష్టపరిహారం, 2 ఎకరాల భూమి, తల్లి లేదా తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి నిర్మాణానికి స్థలం కేటాయించాలని అన్నారు. ఇవన్నీ అమలయ్యేలా చూడాలని సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌ను ఆదేశించారు. విద్యార్థిని మృతికి కారణం అయిన వారిని సస్పెండ్‌ చేయాలని సూచించారు. దీనిపై కలెక్టర్‌, ఎస్పీ ప్రత్యేక చొరవ ఎందుకు చూపలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌ మాట్లాడుతూ విద్యార్థిని మృతికి కారకులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేస్తామన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం నిబంధనల మేరకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్‌ సభ్యులు వడిత్య శంకర్‌ నాయక్‌, సిఐ వేణుగోపాల్‌, డాక్టర్‌ రామకృష్ణ, విద్యార్థిని తల్లిదండ్రులు రమణ, రమాదేవి, విద్యార్థి సంఘాల నాయకులు బాబావలి, చంద్రశేఖర్‌రెడ్డి, నాగభూషణ, గిరిజన సంఘాల నాయకులు శంకరయ్య, ఎన్‌ రవీనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.