ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధే లక్ష్యం
ప్రారంభ సభలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్
ప్రజాశక్తి - నరసాపురం టౌన్
జిల్లాలో ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధే లక్ష్యంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర నరసాపురంలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పట్టణంలోని కళాశాల, పాఠశాలల విద్యార్థులు తరలిరాగా వైఎన్ కళాశాల రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ పట్టణాధ్యక్షులు ఎమ్‌డి.జాన్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ విద్యను బలపేతం చేయాలన్నారు. జిల్లాలో ప్రభుత్వరంగంలో యూనివర్సిటీని అన్ని కోర్సులతో ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. నాడు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తే ఆయన తనయుడు జగన్ ఆ స్కాలర్‌షిప్‌లను ఎత్తేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రంలో కొన్ని వేల మంది పేద విద్యార్థులకు జగన్ ప్రభుత్వం ఉన్నత విద్యను దూరం చేసిందని మండిపడ్డారు. జిల్లా కార్యదర్శి డి.పెద్దిరాజు మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు రోజుకి కేవలం రూ.52 కేటాయించడం హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలియజేస్తుందని విమర్శించారు. ఆ రూ.52తో మార్కెట్లో మంత్రి ఒక్క పూట టిఫిన్ చేయగలరా అని ప్రశ్నించారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు నెలకు రూ.2500కు పెంచాలని కోరారు. అనంతరం కె.ప్రసన్నకుమార్ జెండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించారు. యాత్ర పట్టణంలో పలు పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లను సందర్శించింది. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో జగనన్న విద్యా కానుక కిట్లు నాసిరకంగా ఉన్నట్లు గుర్తించామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి.వాసు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం మెనూ మార్చినప్పటికీ ఛార్జీలు పెంచకపోవడం వల్ల నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు టి.ప్రసాద్, నాయకులు పి.సాగర్, అనిల్, సూరజ్, ప్రవల్లిక, సిరి, కె.యశ్వంత్, పి.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.










