ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
విద్యార్థి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందని, మన జీవితానికి కావాల్సిన అన్ని హంగులు తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందని, వేసవి సెలవులలో ఇటువంటి శిక్షణను పొందడం ద్వారా క్రమశిక్షణ సాధించవచ్చునని కలెక్టర్ హరి నారాయణన్ అన్నారు. చిత్తూర్ లో పది రోజుల పాటు వేసవి శిక్షణ ను ముగించుకున్న ఎన్‌సిసి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ శిక్షణ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత జిల్లా కలెక్టర్ కు ఎన్ సి సి అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని, ఇటువంటి క్రమశిక్షణ ఎన్ సి సి ద్వారా పొందవచ్చునని, వేసవి కాలంలో ఈ శిక్షణకు దీని విలువ తెలిసి పంపినందుకు తల్లిదండ్రులకు కతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా సెలవు రోజులలో కూడా ఆసక్తిగా ఇటువంటి క్యాంపుకు రావడం ఆనందంగా ఉందని అన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా మేజర్ రంగనాథం మాట్లాడుతూ ఎన్నో కార్యక్రమాలు ఉన్నా జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమానికి రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను దుశ్శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కల్నల్ అజరు బస్థోగి, కర్నూల్ చత్రు లు పాల్గొన్నారు.










