Jun 29,2023 21:25

సంస్మరణ సభలో మాట్లాడుతున్న రమేష్‌రెడ్డి భార్య మధులత

        ప్రజాశక్తి-అనంతపురం    అనంత విద్యారంగంలో రమేష్‌రెడ్డి చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు. ఆర్ట్స్‌ కళాశాలలో రాజనీతి శాస్త్ర లెక్చరర్‌గా అనేక సంవత్సరాలు పనిచేసి అకాల మరణం పొందిన నీలం రమేష్‌రెడ్డి చిత్రపటానికి ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ దివాకర్‌రెడ్డి అధ్యక్షతన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రమేష్‌రెడ్డి ఆర్ట్స్‌ కళాశాలలో పని చేసినన్ని రోజులూ విద్యార్థుల్లో నిరంతర స్ఫూర్తిని నింపారన్నారు. రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ రంగస్వామి మాట్లాడుతూ విద్యార్థుల హృదయాల్లో ఇంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న లెక్చరర్‌ని తన మిత్రుడు అని చెప్పుకోవడం గర్వంగా ఉందన్నారు. డిగ్రీ అధ్యాపకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ మాట్లాడుతూ అధ్యాపకుల సమస్యలపై చేయాల్సిన పోరాటాలకు మార్గ మార్గదర్శకత్వం వహించారన్నారు. వెనుకుండి మమ్మల్ని నడిపారన్నారు. పూర్వ విద్యార్థి పోతుల రాధాకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే తమలో ప్రజాస్వామ్య తత్వపు లోతైన బీజాలు వేశారన్నారు. బుల్లెట్‌ చేయలేని పని బ్యాలెట్‌ చేస్తుందని, రేపటి భవిష్యత్తును దర్శించే ఒక సుగుణాన్ని మాకు నేర్పారన్నారు. మరో పూర్వ విద్యార్థిని యమున మాట్లాడుతూ స్త్రీ పురుష సంబంధాల కేంద్రంగా సమానత్వాన్ని సాధించుకోవడం స్త్రీల హక్కుని ఆ దిశగా మమ్మల్ని వారు చైతన్య పరిచారన్నారు. రమేష్‌రెడ్డి భార్య మధులత మాట్లాడుతూ విద్యార్థులకు ఎంత స్ఫూర్తిగా నిలిచారో, భార్యగా, స్త్రీగా తనకూ అంతే మార్గదర్శకత్వం వహించారన్నారు. స్త్రీలను కూడా పురుషులతో సమానంగా గౌరవించే విశిష్ట లక్షణాన్ని రమేష్‌రెడ్డిలో చూశామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపల్‌ వెంకట శివారెడ్డి, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు రామకృష్ణారెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు ప్రగతి, జయరామిరెడ్డి, వర్ధమాన గాయకులు లెనిన్‌, లక్ష్మీనారాయణ, పూర్వ విద్యార్థులు నరేష్‌, కృష్ణారెడ్డి, నాగరాజు, ఆర్ట్స్‌ కళాశాల ఫిలాసఫీ లెక్చరర్‌ జూటూరు రమేష్‌, చిదంబరయ్య, అబ్దుల్‌ బాషా, లక్ష్మీనారాయణ, శివన్న, హరి, గోవర్ధనగిరి, కానాల కృష్ణారెడ్డి, వాసు, కిషోర్‌, రామగిరి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ అంజి, శ్రీలక్ష్మి, దీవెన, తదితరులు పాల్గొన్నారు.