విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత
సమన్వయంతో పనిచేయండి: కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నాడు - నేడు కార్యక్రమం చేపట్టడం జరిగిందని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన పాళశాలలు సజావుగా నిర్వహించడానికి తీసుకోవాల్సిని చర్యలపై జిల్లా విద్యా శాఖాధికారులు ఇతర సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందని, నాడు- నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చడం, తల్లిదండ్రులకు విద్యభారం కాకుండా అమ్మఒడి పథకం అందించడం, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద పథకాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. పాఠశాలల నిర్వహణకు విద్యాశాఖ సమగ్రశిక్ష, వైద్యఆరోగ్యశాఖ, ఐసిడిఎస్, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సమావేశంలో డీఈఓ పురుష్తోం, సమగ్ర శిక్షా అదనపు కో-ఆర్డినేటర్ వెంకట రమణారెడ్డి, జెడ్‌పిసిఇఓ ప్రభాకర్‌రెడ్డి, డిఎంఅండ్ హెచ్‌ఓ ఆర్‌ఆర్.రెడ్డి, చిత్తూరు మున్సిపల్ కమీషనర్ అరుణ, ఐసిడిఎస్ పీడీ నాగశైలజ, బిసి వెల్ఫేర్ ఆఫీసర్ రబ్బానీ బాష పాల్గొన్నారు.










