Apr 27,2023 08:44

నార్పలలో వసతి దీవెన మెగా చెక్కును అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి

          అనంతపురం ప్రతినిధి : 'రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చాం. ప్రయివేటుకు ధీటుగా కాదు.. ప్రభుత్వం పాఠశాలలతో ప్రయివేటు బడులు పోటీపడే పరిస్థితి రాబోతోంది.' అని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు నార్పల మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయి వసతి దీవెన పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా వసతి దీవెన కార్యాక్రమం కింద 9.55 లక్షల మందికి రూ.912.71 కోట్లను బటన్‌ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి విద్యార్థులు, ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని విధంగా విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రయివేటుకు ధీటుగా కాదు... ప్రయివేటు విద్యా సంస్థలే ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడే పరిస్థితులను తీసుకొస్తున్నట్టు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదటి విడత నాడు-నేడు పనులు పూర్తయిన 30,232 పాఠశాలల్లో ఇంటరాక్టీవ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌ ద్వారా డిజిటల్‌ విద్యా బోధన తీసుకురానున్నామని వివరించారు. దీన్ని చూసి ప్రయివేటు విద్యా సంస్థలు సైతం ఈ పద్ధతిని పాటించాల్సి వస్తుందన్నారు. ఉన్నత విద్యా విధానంలోనూ అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. అంతర్జాతీయ పోటీని తట్టుకుని నిలబడే విధంగా ఉన్నత విద్యా విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో 37 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగిందన్నారు. ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 87 వేల నుంచి 1.20 లక్షలకు పెరిగిందని చెప్పారు. ఉన్నత విద్యలో తీసుకొస్తున్న మార్పులతో అంతర్జాతీయంగా ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు రాణించాలని ఆకాంక్షించారు. ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక్క సత్యనాదేళ్లనే ఉన్నారని, అటువంటి వారు వందమంది కావాల్సిన అవసరముందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా టాప్‌ 50 విశ్వవిద్యాలయంలో సీటు వచ్చిన విద్యార్థులకు రూ.1.50 కోట్లు ఖర్చు చేసి విదేశీ విద్యా కానుక ద్వారా ప్రభుత్వమే చదివిస్తుందని చెప్పారు. ఉపాధిని కల్పించే విధంగా ఉన్నత విద్యాలోనూ మార్పులు తీసుకొచ్చినట్టు వివరించారు. ఇంటర్నుషిప్‌ విధానం తీసుకొచ్చామన్నారు. విద్య ద్వారానే సమాజ మార్పు జరుగుతుందన్న ఆశాభావం తమ ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతోనూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషచరణ్‌ శ్రీ , విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీలు వై.శివరామిరెడ్డి, పోతుల సునీత, జిల్లా కలెక్టర్‌ గౌతమి ఇతర జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
హెలిక్యాప్టర్‌లో సాంకేతిక సమస్య... రోడ్డు మార్గంలోనే తిరుగు ప్రయాణం
విద్యా వసతి దీవెన కార్యక్రమం ముగిసిన తరువాత ముఖ్యమంత్రి హెలిప్యాడ్‌ వద్ద జిల్లా నాయకులతో ముచ్చటించారు. జిల్లాలోని సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన తిరుగు ప్రయాణం అవడానికి హెలీక్యాప్టర్‌ ఎక్కాక అది మోరాయించింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆయన రోడ్డు మార్గంలోనే పుట్టపర్తికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు వెళ్లారు.
స్పృహ తప్పిన ఇద్దరు
ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నార్పల బహిరంగ సభలో ఇద్దరు సృహ తప్పి కిందపడిపోయారు. ఎస్‌ఎల్‌న్‌ విద్యా సంస్థలో చదువుతున్న పూజితారెడ్డి అనే విద్యార్థిని స్పృహ తప్పిపడిపోయింది. తోటి విద్యార్థులు వెంటనే ఆమెను వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలోకి తీసుకెళ్లి వైద్యులు చికిత్స అందించారు. ఎన్నికల విధులకు వచ్చిన మరో మహిళ కూడా ఇదే రకంగా పడిపోవడం జరిగింది. ఆమెకు చికిత్సను అందించారు. వేసవి కాలమైనప్పటికీ బుధవారం ఆకాశం మేఘావృతమై ఉండి కొంతసేపే వాతావరణ చల్లగా ఉన్నప్పటికీ తరువాత వేడెక్కింది. ఈ ఎండ వేడిమికి ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు.