Nov 02,2022 21:16

విద్యా, వైద్యరంగాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
ఆసుపత్రికి వచ్చే రోగాలకు మెరుగైన వైద్య సేవలు అందించండి: కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లాకలెక్టర్‌ ఎం.హరి నారాయణన్‌ వైద్యాధికారులను సూచించారు. బుధవారం కలెక్టర్‌ జిల్లా ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయడంలో భాగంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆస్పత్రిలోని ప్రతివార్డును అక్కడ అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యరంగ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రస్తుతం అందిస్తున్న వైద్యసేవలను మరింత విస్తతం చేయాలని అధికారులకు సూచించామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వ హించే డాక్టర్లకు ముఖఆధారిత హాజరును ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషంట్లకు అవసరమైన మందులు అందించేందుకు తగుచర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని తీసుకు రావడం జరిగిందని, తద్వారా గ్రామీణ ప్రాంతాలలో మరింతగా వైద్యసేవలను అందించేందుకు అవకాశం ఏర్పడిందని చిత్తూరు జిల్లాలో కూడా ఈవిధానాన్ని అమలు చేయడం జరుగుతున్నదని అన్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న వైద్యసేవలతో పాటు అదనంగా వైద్యసేవలను అందించేందుకు కషి చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆసుపత్రి ఆవరణంలో ఉన్న పిచ్చి మొక్కలను శుభ్రం చేయాలని వైద్యసేవల నిమిత్తం వచ్చే పేషెంట్లకు సరైన వైద్యం అందించాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో రోజువారి సుమారుగా 2000 పైచిలకు పేషెంట్లు ఓపికి రావడం జరుగుతుందని, ఈనెల 1వతేదీన 423 మంది ఇన్‌ పేషెంట్లు ఉండగా అందులో 120మంది కొత్త అడ్మిషన్లు జరిగిందని మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ కలెక్టర్‌కు వివరించారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఓపి వార్డు, ఐసీయూ, మైక్రోబయాలజీ, క్లినికల్‌ పాథాలజీ, బయో కెమిస్ట్రీ, ల్యాబ్‌, తదితర విభాగాలను అలాగే నూతనంగా నిర్మించిన చిన్నపిల్లల వార్డు, ఆప్తమాలజీ వార్డు, ఇతర వార్డులను, ప్రతివిభాగాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా వివిధ విభాగాలలో అందిస్తున్న వైద్యసేవలు, ఉన్న సిబ్బంది వివరాలు, రోజువారి ఓపి వివరాలు తదితరాంశాలను కలెక్టర్‌కి సూపరింటెండెంట్‌ వివరించారు. డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ నాయక్‌, అపోలో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ నరేష్‌ కుమార్‌రెడ్డి, సీనియర్‌ మెడికల్‌ అడ్మినిస్ట్రేటర్‌ డాక్టర్‌ రామ్‌గోపాల్‌ రెడ్డి, అపోలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుధాకర్‌, ఇతర సంబంధిత అధికారులు డాక్టర్లు పాల్గొన్నారు.