ప్రజాశక్తి-రాయదుర్గం రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని బిటిపి రోడ్డు మోడల్ కాలనీ, బళ్లారి రోడ్డులోని గౌడ లేఔట్‌లో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలను శుక్రవారం విప్ కాపు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పొరాలు శిల్ప, అడిషనల్ డిఎంహెచ్‌ఒ డాక్టర్ సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌడ లేఔట్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కాపు మాట్లాడుతూ స్థానికంగానే ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో సిఎం జగన్ విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్న వైసిపిని మరోమారు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా ప్రోగ్రాం మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ చెన్నకేశవు లు, కమిషనర్ దివాకర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీనివాస్ యాదవ్, గౌనిఉపేంద్రరెడ్డి, వలిబాషా, కౌన్సిలర్లు, వైద్యులు అలేఖ్య, అజర్‌ఖాన్, గృహ నిర్మాణ సంస్థ రాష్ట్ర డైరెక్టర్ శ్రీనివాసు లు, మెప్మా టిఎంసి నారాయణరెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
అవినీతి కేసుల్లో చంద్రబాబుకు శిక్ష ఖాయం
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అత్యంత అవినీతిపరుడని గతంలో తెహల్కా డాట్ కామ్ వెల్లడించిందన్నారు. విదేశాల్లో సైతం అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తులను కూడాబెట్టినట్లు దర్యాప్తుల్లో వెల్లడైందన్నారు. పలు అవినీతి కేసులు నమోదు కాగా పలుకుబడితో కోర్టులో కేసులను తప్పించుకుంటూ ప్రధాని మోదీ బూట్లు నాకుతూ, హోం మంత్రి అమిత్‌షా కాళ్లు పట్టుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు. టిడిపి హయాంలో రకరకాల పథకాల పేరిట చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు, వారి అనుచరులు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారన్నారు. చంద్రబాబు చట్టం నుంచి తప్పించుకోలేరు. ఏదో ఒక రోజు శిక్ష పడటం ఖాయమన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు, ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలని కోరారు.
మాట్లాడుతున్న విప్ కాపు రామచంద్రారెడ్డి










