Nov 03,2022 21:52

విద్య, వైద్యం ముఖ్యమంత్రికి రెండు కళ్లు : డిప్యూటి సిఎం
ప్రజాశక్తి- కార్వేటినగరం:
రాష్ట్రాభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైద్యం, విద్య రెండు కళ్లని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. గురువారం కార్వేటినగరం వెలుగు కార్యాలయంలో నియోజకవర్గంలోని వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి విద్య, వైద్యం అందిస్తేనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి వైద్యం.. విద్యకు పెద్ద పీఠ వేస్తున్నారని.. జీడీనెల్లూరు నియోజకవర్గాన్ని పులివెందల తరహాలో అభివద్ధి చేస్తున్నారన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ఎంత అడిగినా ఆలోచించకుండా నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గంగాధరల్లూరు నియోజకవర్గంలో రెండు పీహెచ్‌సీలు మంజూరు చేసి వేగవంతంగా భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. వైద్యులు కనిపించే దేవుళ్లుగా భావిస్తారని.. అలాంటి వైద్యులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని కోరారు. వైద్యులు అందించే సేవలతోనే ఏడాదిలోపే పంద పడకల ఆస్పత్రిగా మారుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ బీసీకే నాయక్‌ మాట్లాడుతూ ప్రజలు మెరుగైన వైద్యం కోసం బయట ప్రాంతాలకు వెళ్లకుండా ఇతర ప్రాంతాల నుంచి కార్వేటినగరం సీహెచ్‌సీకి వచ్చేలా వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం డాక్టర్‌ శ్రీహరి మాటాడుతూ జిల్లాలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు అందించడానికి కార్వేటినగరం సీహెచ్‌సీలో అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయని..అందుకు తగ్గట్టుగా వైద్యాధికారులు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డీఐవో డాక్టర్‌ రవిరాజు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చొరవతో సీహెచ్‌సీ ప్రారంబించిన వెంటనే వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లతా బాలాజీ, డీపీఎంయూ శ్రీనివాస్‌, మండల పార్టీ కన్వీనర్‌ ధనంజయవర్మ, రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి ధనంజయరెడ్డి, తహసీల్దార్‌ అమర్‌నాథ్‌, ఎంపీడీవో 'మోహన మురళీ, శేఖర్‌రాజు, పట్నం ప్రభాకర్‌రెడ్డి, వైద్యాధికారులు పాల్గొన్నారు.