Jul 20,2023 21:10

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్య ప్రయివేటీకరణ విధానాలను విద్యార్థులు తిప్పికొట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు నితీష్‌ నారాయణ విద్యార్థులకు పిలుపునిచ్చారు. జిల్లాలో విద్యారంగ అభివృద్ధి కాంక్షిస్తూ విద్యాలయాల్లో సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఈ నెల 11న నరసాపురంలో ప్రారంభించిన విద్యార్థి సంగ్రామ సైకిల్‌యాత్ర గురువారం జిల్లా కేంద్రం భీమవరంలో ముగిసింది. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పి.వాసు అధ్యక్షతన స్థానిక లాంచీలరేవు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథి నితీష్‌ నారాయణ మాట్లాడుతూ విద్య అనేది ప్రతి విద్యార్థికీ జన్మహక్కుగా ఉండాలన్నారు. అయితే దేశంలో అటువంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య ప్రయివేటీకరణ విధానాలు అమలు చేస్తున్నాయన్నారు. క్యూబా లాంటి దేశాలను సందర్శించినప్పుడు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అక్కడి ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత విద్యను అందిస్తున్నాయన్నారు. విద్యను ప్రోత్సహించని ప్రభుత్వం సమాజ వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పెద్ద పెద్ద అంబేద్కర్‌ విగ్రహాలు పెడుతున్నారుగాని ఆయన కోరుకున్న సమానత్వం కోసం ఏ ప్రభుత్వాలూ పని చేయడం లేదని విమర్శించారు. ఆశయాల సాధన చేయని ప్రభుత్వాలకు విగ్రహాలు పెట్టే హక్కు లేదని మండిపడ్డారు. రోజు కూలీ, ఆటో డ్రైవర్‌, వ్యవసాయదారుడు, ప్రతి సామాన్యుడు పిల్లలకు కూడా ఉన్నత విద్య అందించాలని, దీనికోసం ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. నిర్బంధం పెట్టినా, జైళ్లకు పంపినా అందరికీ ఉచిత విద్య సాధించేవరకు ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమం ఆగదన్నారు. దేశంలో నిజమైన స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం వచ్చేవరకు విద్యార్థులందరూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిఒ నెం.77ను తీసుకొచ్చి పేద విద్యార్థులందరికీ ఉన్నత విద్యను దూరం చేసిందన్నారు. 25 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తాము అధికారంలోకి రాగానే మెగా డిఎస్‌సి నిర్వహించి భర్తీ చేపడతామని చెప్పిన జగన్‌ ఇప్పుడు ఆ హామీని మరిచారని విమర్శించారు. పాఠశాలలు పెట్టాల్సిన ప్రభుత్వం జిఒ నెం.117 ద్వారా పాఠశాలలను మూసివేస్తుందని మండిపడ్డారు. హాస్టల్‌ విద్యార్థులకు రోజుకు రూ.52 కేటాయిస్తే ఎలాగని, అదే సొమ్ముతో సంబంధిత మంత్రి హోటల్‌లో టిఫిన్‌ చేయగలరా అని ప్రశ్నించారు. విద్యార్థులకు మెస్‌ ఛార్జీలు వెంటనే పెంచి నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.పెద్దిరాజు మాట్లాడుతూ సైకిల్‌ యాత్రలో భాగంగా జిల్లాలో పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లలో సుమారు 40 వేల మంది విద్యార్థులను ప్రత్యక్షంగా కలుసుకున్నామన్నారు. జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ, ప్రభుత్వ కాలేజీలను, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి అందరికీ దక్కాలని భవిష్యత్తులో పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు. దీనిపై త్వరలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ప్రకటించారు. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.ధనుష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాన్‌ప్రసాద్‌, నాయకులు పి.నాగేంద్రకుమార్‌, కె.ఈశ్వర్‌, బి.గణేష్‌, జి.శ్రీనివాసు, కె.శాంతి, కె.నవీన్‌, ఎన్‌.పవన్‌, బి.చిరంజీవి, బి.సింధుసాయి, శేఖర్‌, రవి, సిద్దు పాల్గొన్నారు.