
శ్రీకాకుళం అర్బన్ : విదేశీ కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులతో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎపి కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. నగరంలోని సుందరయ్య భవనంలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రి ఉత్పత్తుల దిగుమతులకు అవకాశం కల్పించడం వల్ల కొబ్బరి రైతులకు కనీసం ధరలు రావడం లేదన్నారు. కొన్నేళ్లుగా ఎర్రనల్లి, తెల్లదోమ వంటి తెగుళ్ల వల్ల దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో కొబ్బరికాయకు రైతుకు రూ.6 నుంచి రూ.7లు మాత్రమే ధర వస్తోందన్నారు. చెట్టు నుంచి కొబ్బరికాయలు కోసి గుట్టగా పోయడానికి ఒక్కో కాయకు రైతుకు రూ.3లకు పైగా ఖర్చు అవుతుందన్నారు. రైతు చేతికి కాయకు రూ.3 మించి రావడం లేదన్నారు. కొబ్బరి కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మిల్లింగ్ కోప్రాకు క్వింటాకు రూ.10,860, బంతి కోప్రాకు క్వింటాకు రూ.11,750 ఏమాత్రం రైతుకు గిట్టుబాటు కాదన్నారు. ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కొబ్బరి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలన్నారు. ప్రభుత్వాలు కొబ్బరి రైతులను ఆదుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిం చారు. రైతుల నుంచి కొబ్బరికాయలను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని వెయ్యి కొబ్బరి కాయలకు కనీస ధర రూ.15 వేలు ఇవ్వాలన్నారు. కేరళ తరహాలో సహకార రంగంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యాన శాఖ ద్వారా కొబ్బరి రైతులకు సబ్సిడీ పథకాలు అందించాలన్నారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, బి.వాసు, చంద్రరావు, కొండయ్య, పి.భాస్కరరావు, రైతులు, రైతు సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.