గుట్టుచప్పుడు కాకుండా ఇసుక రీచ్ నిధులు స్వాహా
రూ.13,25,923లు అభయహస్తం ఖాతాకు బదిలీ
ఇదే తరహాలో కలికిరి, కెవిపల్లెలోనూ అవినీతి
ఆధారాలతో బయటపెట్టినా పట్టించుకోని అధికారులు
సమగ్రవిచారణ చేపట్టాలని
సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్
ప్రజాశక్తి-వాల్మీకిపురం:
మండల సమాఖ్య కార్యాలయంలో ఆరుగురు కలసి రూ.13,25,323లు స్వాహా చేసినట్లు ఆధారాలతో సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు వెలుగులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా వాడ గంగరాజు మాట్లాడుతూ మండలంలోని తాటిగుంటపల్లె, మంచూరు ఇసుక రీచ్ ఖాతాలను క్లోజ్ చేసి మొత్తం నగదుకు అభయహస్తం ఖాతాకు తరలించి, స్వాహా చేసినట్లు తెలిపారు. 25.3.2021న తాటిగుంటపల్లెకు చెందిన ఇసుక రీచ్ ఖతాలో ఉన్న రూ.3,35,323లు, అలాగే 6.04.2021న మంచూరుకు చెందిన ఇసుక రీచ్ ఖాతాలో ఉన్న రూ.9,90,600లు నగదును అభయహస్తం ఖాతాకు తరలించారన్నారు. అభయహస్తం ఖాతా ఇనాక్టివ్ ఖాతా అకౌంట్ అని, ఈ ఖాతా ద్వారా వాటాదారుల నుండి వసూలు చేసే సేవా రుసుము మాత్రమే జమ చేసి సెర్ప్ (ఎస్‌ఇఆర్‌పి)కు బదిలీ చేసేందుకు మాత్రమే ఖాతాను ఉపయోగించాలన్నారు. అలాంటి ఖాతాకు ఇసుక రీచ్ నిధులు తరలించి, మండల సమాఖ్య అధ్యక్షురాలు అలివేలు, స్వీపర్ దేవయాని, అకౌంటెంట్ రజని కుమారి, అకౌంటెంట్ భర్త నరసింహులు, సంఘమిత్ర శారద, ఏఆర్ స్వప్న పేర్ల మీద నగదు విత్‌డ్రా చేసిస్వాహా చేసినట్లు తెలిపారు. అలాగే చింతపర్తి ఇసుక రీచ్ ఖాతా మండల సమాఖ్య అధ్యక్షురాలు అలివేలు పేరున ఉన్నందున చింతపర్తి రీచ్ నగదును ఖాతాకు తరలించి, అక్కడే స్వాహా చేయడం జరిగిందన్నారు. ఇదే తరహాలో కలికిరి, కెవిపల్లె మండలాల్లో అవినీతి జరిగిందని, ఆధారాలతో సహా సిఐటియు బయటపెడితే ఆరు నెలలు కావస్తున్నా ఇంత వరకు ఏఒక్క అధికారి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లా యంత్రాంగం నెలలు కావస్తున్నా ఇంత వరకు ఏఒక్క అధికారి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లా యంత్రాంగం స్పందించకపోవడం చూస్తుంటే అవినీతిలో వీరి పాత్రకూడా ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతుందని మండిపడ్డారు.
ఏడేళ్లుగా ఒక్కరే సమాఖ్య అధ్యక్షురాలు
ఏపీఎంఏసిఎస్ చట్టం 1995 ప్రకారం మండల మహిళా సమాఖ్య పదవీ కాలం ఒక్క సంవత్సరం మాత్రమే. కానీ ఇక్కడ అధికారుల అడుగులకు మడుగులు ఒత్తుతుండడంతో ఏకధాటిగా గత ఏడు సంవత్సరాలుగా ఒక్కరే అధ్యక్షురాలు ఉండడం గమనార్హం. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులకు మామూలు చేరుతుండడంతో ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు అనేకం వినిపిస్తున్నాయి. ఏడేళ్లుగా ఒక్కరే అధ్యక్షురాలు ఉండడంతో ఈమె చెప్పిందే శాశనం ఎదురొస్తే నాశనం అనే రీతిలో కార్యాలయం తయారవడంతో ప్రజలు మండిపడుతున్నారు.
విచారణలు సరే.. చర్యలు ఏవి..?
కలికిరి మండలం ఇసుక రీచ్‌ల నిధుల అవకతవకలపై మండల ఏపీఎం వెంకటరమణ తాను నిధులను వాడుకొన్నానని ఒప్పుకొన్నాడని, కెవిపల్లె జిల్లెలమంద ఇసుక రీచ్ నిధులను ఏపీఎం ప్రభాకర్‌రెడ్డి తమ కుమార్తె ఖాతాకు నగదు బదిలీ చేసి, తన ఖాతా నుండి ఏరియా కోఆర్డినేటర్, డిఎంజి ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేసినట్లు విచారణలో నిజాలు తేలినా కూడా డిఆర్‌డిఏ పీడీ, జాయింట్ కలెక్టర్ ఇంత వరకు వారిపై చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఏరియా కోఆర్డినేర్, డిఎంజిలు ఏపీఎం దగ్గర అప్పుగా తీసుకొన్నామని చెప్పి, దీనికి నకిలీ బాండ్లను కూడా సృష్టించడం హాస్యాస్పదమన్నారు. ఏపీఎంల వద్ద నగదు రికవరీ చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. డబ్బులు స్వాహా చేసుకొంటూ పోతుంటే.. యంత్రాంగం చర్యలు తీసుకోకుండా రికవరీ చేసుకుంటూ పోతుందా.. చర్యలు తీసుకోరా..? ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. కలికిరి, కెవిపల్లెలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాల్సిందే అని వాడ గంగరాజు డిమాండ్ చేశారు.
సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి
వాడ గంగరాజు
వాల్మీకిపురం, కలికిరి, కెవిపల్లె మండలాల్లోని ఇసుక రీచ్‌లల్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తీవ్రఆందోళనలు చేపడుతామని సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. కలికిరి, కెవిపల్లెల్లో జరిగిన అవినీతిపై ఆధారాలతో సహా ఆరునెలల క్రితం బయటపెట్టినా ఇంత వరకు పట్టించుకోకపోవడం అధికారుల ఆలసత్వానికి నిదర్శనమన్నారు. మూడు మండలాల్లోనే లక్షల్లో అవినీతి వెలుగులోకి వస్తే.. జిల్లా ఎంత అవినీతి జరిగిందో విచారణ చేస్తే వెలుగుచూస్తుందన్నారు. అధికారులు అవినీతికి పాల్పడుతుంటే జిల్లా యంత్రాంగం నిద్రపోతుందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి సమగ్రవిచారణ చేపట్టి, అవినీతి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.










