అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేత
ప్రజాశక్తి - ఆచంట
విఆర్‌ఎలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని విఆర్‌ఎల సంఘం మండల అధ్యక్షులు తలుపురి ముత్యాలరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆచంట పెద్దపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ స్థాయి నుంచి ప్రమోషన్ కల్పించాలని కోరారు. నామినీగా పనిచేస్తున్న విఆర్‌ఎల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వెంకట్రావు, సాయిరాం, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పాలకొల్లు : విఆర్‌ఎలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని నరసాపురం డివిజన్‌లోని విఆర్‌ఎలు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాలకు చెందిన విఆర్‌ఎలు పాలకొల్లు అంబేద్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. కార్యక్రమంలో విఆర్‌ఎల నర్సాపురం డివిజన్ సంఘం అధ్యక్షులు మోటూరి మోషే, పాలకొల్లు మండల అధ్యక్ష కార్యదర్శులు టి.గోవిందరావు, టి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఉండి : తమకు ప్రభుత్వం రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎన్‌ఆర్‌పి అగ్రహారంలోని అంబేద్కర్ విగ్రహానికి విఆర్‌ఎలు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విఆర్‌ఎ జిల్లా నాయకులు పిల్లి సుబ్బారావు మాట్లాడారు. కార్యక్రమంలో విఆర్‌ఎలు ముత్యాలపల్లి గణేష్, యేసు రత్నం, ప్రసాద్, గోపాలకృష్ణ, నాగరాజు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విఆర్‌ఎ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ విఆర్‌ఎలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మండలాలకు చెందిన విఆర్‌ఎలు గుమ్మళ్ల వెంకటేశ్వరరావు, నక్కా సుబ్బారావు, వి.వెంకట్రావు, పి.శ్రీనివాస్, నర్సయ్య, తాతారావు, ధనరాజ్, సువర్ణరాజు పాల్గొన్నారు.
తణుకురూరల్ : విఆర్‌ఎలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఎన్‌టిఆర్ పార్కు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు చెందిన విఆర్‌ఎలు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల మంది గ్రామ రెవెన్యూ సహయకులు పనిచేస్తున్నారన్నారు. నిలుపుదల చేసిన టిఎ, డిఎ తిరిగి చెల్లించి కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షులు బి.గణేష్, ఎం.బలరాం, ఎ.మల్లయ్య, సిహెచ్ రాము పాల్గొన్నారు.










