Dec 23,2022 22:51

జీతాలు అందక అల్లాడుతున్న సిబ్బంది

వెలుగులు నింపని 'కంటి వెలుగు'
ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌:
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా 2019లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేలా వైయస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చింది. వద్ధులకు కంటి వైద్య ప్రాథమిక పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్సలు నిర్వహించేలా 2020 అక్టోబర్‌ 10న ప్రపంచ దష్టి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పథకాన్ని విద్యార్థులతో పాటు వద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా విస్తరించారు. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ప్రాథమిక కంటి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌, పిహెచ్‌సి, సిహెచ్సీలలో వద్ధులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.
విద్యార్థులతో పాటు, 60 ఏళ్లు దాటిన వద్ధులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్స చేయాలని, అద్దాలు అందజేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. మొదటి ఏడాది వైద్య పరీక్షలు నిర్వహించి అద్దాలు అవసరమయ్యే వారి జాబితాను, శస్త్ర చికిత్సలు అవసరమయ్యే వారి జాబితాలను వేర్వేరుగా సిద్ధం చేశారు. కరోనా కారణంగా ఈ పథకం మధ్యలోనే ఆగిపోయింది. నాడు అద్దాలు, శస్త్ర చికిత్సల కోసం ఎంపిక చేసిన వారు దీర్ఘకాలం నిరీక్షించి సొంత ఖర్చులతో అద్దాలు, శాస్త్ర చికిత్సలు చేయించుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైయస్సార్‌ కంటి వెలుగు పథకం కోసం ఆశ, ఏఎన్‌ఎం, ఎంపిహెచ్‌ఎస్‌ సిబ్బంది సాయంగా మరో పది మందిని తాత్కాలిక ప్రాతిపదికన విధుల్లోకి తీసుకున్నారు. ఇలా నియమించబడిన తాత్కాలిక సిబ్బంది ఏడాదిగా జీతాలందక అల్లాడు తున్నారు. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. వీరికి సంబంధించిన నియామక ఉత్తర్వులు పొడిగించలేదు. జిల్లా ఆంధ్రప్రభ నివారణ సంస్థలో సిబ్బంది కొరత వెంటాడుతోంది.
దష్టి లోపాలతో ఇబ్బందులు
దష్టి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, వద్ధుల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వైయస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని కొన సాగించాలని విద్యార్థులు, వద్ధులు కోరుతు న్నారు. దష్టిలోపాలతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తే వేలకు వేలు ఫీజుల రూపంలో చెల్లిం చాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించి అద్దాలు, శాస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా నిర్వహించాలని కోరుతున్నారు.
వైయస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని జిల్లాలో ప్రారంభిస్తున్న అప్పటి జిల్లా కలెక్టర్‌,
వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ అధికారులు(ఫైల్‌ ఫోటో)