Sep 20,2023 22:50

వెలుగు నింపని 'కంటి వెలుగు'
 తొలగని అంధకారం
 25 శాతం మందికే కంటి అద్దాలు
ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్‌:

రాష్ట్ర ప్రభుత్వం 2019లో వైయస్సార్‌ కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లో వైద్యనిపుణులు ప్రభుత్వ, యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుండీ పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. రెండు విడతల్లో పరీక్షలు చేయించుకున్న విద్యార్థుల్లో 25శాతం మందికి మాత్రమే కంటిఅద్దాలు పంపిణీ చేశారు. కంటి వైద్యనిపుణులు పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అవసరమైన పిల్లలకు అనేకమంది నేటికీ కంటి అద్దాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు.
35 శాతం మందికి పంపిణీ కానీ కంటి అద్దాలు
వైద్యనిపుణులు లెక్కల ప్రకారం ప్రతి పాఠశాల్లో 15 నుండీ 25 శాతం మంది విద్యార్థులు కంటిసమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లో అక్షరాలు కనిపించకపోవడం, క్లాస్‌రూమ్‌ బోర్డు సక్రమంగా కనిపిచండం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సెల్‌ఫోన్సు ఎక్కువగా చూడటం, డిజిటల్‌ తరగతులు, కంప్యూటర్‌ ముందు కూర్చోవడం, టీవి ఎక్కువగా చూడటం వల్ల కూడా పిల్లల్లో కంటిసమస్యలు వస్తున్నట్లు గ్రహించారు. పాఠశాలల్లో కంటిపరీక్షలు నిర్వహిస్తూ అద్దాల పంపిణీ, శస్త్రచికిత్సలు అలస్యం చేస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ఏటా వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం రూపొందించిన పథకం కరోనా కారణంగా ఆగిపోయింది. 2019 నుండీ తిరిగీ ఈ పథకం పట్టాలెక్కలేదు.
విద్యార్థుల్లో కంటి సమస్యల తీవ్రతను బట్టి పిల్లలకు కళ్ళజోళ్ళు కొంతమందికి చాలా అవసరం అని నిపుణులు సిఫారసు చేశారు. 2019లో రెండోసారి చేసిన పరీక్షల్లో 35శాతం మంది పిల్లలకు ఇంకా కంటి అద్దాలు పంపిణీ చేయాల్సి ఉందని ప్రధాన ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఏటా కంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం 2019 తర్వాత చాలాకాలం పాటు పరీక్షలు చేయించకపోవడం గమనార్హం.
వైయస్సార్‌ కంటి వెలుగు పథకం నేత్ర పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం 2019లో చేపట్టిన మొదటి విడత కార్యక్రమంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. వీరిలో ఇరవై శాతం మంది మాత్రమే కంటి అద్దాలు అందించింది. రెండో విడతలో 14252 మందికి కంటి వైద్య పరీక్షలు చేయగా ఎవరికి కంటి జబ్బులు లేవని నిర్ధారించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే కంటి జబ్బులతో బాధపడుతున్న చిన్నారుతు నిత్యం ఆసుపత్రులు చుట్టూ తిరుగుతున్నారు. వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్‌ ఆస్పత్రి వద్ద చికిత్స చేయించుకోవడం వేచి ఉంటున్నారు.
చిన్నారుల్లో 18 ఏళ్ల వరకు ఎదుగుదల ఉంటుంది. శరీర అవయవాల్లో మార్పులు తగ్గట్టు కంటి చూపులోను మార్పులు ఉంటాయి. నిత్యం ఫోన్లు చూడటం ఆన్లైన్‌ చదువుల నేపథ్యంలో దష్టిలోపం సమస్య పెరుగుతోంది. గతంలో 100 మందికి గాను ఐదు మంది కంటి సమస్యలుంటే ప్రస్తుతం 15 మందికి పైగా కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో కంటి వైద్యపరీక్షలు ఇచ్చిన కంటి అద్దాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఇటీవల యాదమరి మండలం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఒకటి నుండి పదవ తరగతి వరకు కంటి వైద్యపరీక్షలు నిర్వహిస్తే ఒక్కో తరగతిలో సుమారు 4 నుంచి 12 మంది పిల్లలు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
కంటి పరీక్షలకు వేలల్లో ఖర్చు..
ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వివిధ కారణాలతో కంటి సమస్యలు ఎదుర్కొటున్నారు. చిన్న, చిన్న శస్త్ర చికిత్సల కోసం వేలకువేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్కసారి కంటి ఆసుపత్రికి వెళ్ళి సాధారణ ఓపి కోసం రూ.500 నుంచి 1000లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక శస్త్ర చికిత్సల కోసం పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తిరిగీ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించి విద్యార్థులకు కంటి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాగే మొదటి, రెండో విడతల్లో వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు, శస్త్ర చికిత్స కోసం ఎంపిక చేసిన విద్యార్థులు అద్దాలు, శస్త్ర చికిత్సలు నిర్వహించాలని కోరుతున్నారు.