Dec 01,2022 22:25

కినాటంపల్లిలో నత్తనడకన 'అభివృద్ధి'

కూడు..గూడూ.. అన్నీ కరువే..!
˜ 'వెలుగు' నిండని 'షికారీ' బతుకులు
˜ పూసలమ్మితేనే పూట గడిచేది..
˜ కినాటంపల్లిలో నత్తనడకన 'అభివృద్ధి'
ప్రజాశక్తి -యాదమరి

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యింది.. ఆజాదీకా అమృత మహోత్సవాలను వేడుకగా జరుపుకుంటున్నాం.. అయితే ఇప్పటికీ షికారీల బతుకుల్లో వెలుగు లేదు. ప్రభుత్వాలేమో సంక్షేమ పథకాలు 'గడప గడపకూ' చేరుతున్నాయంటారు.. ఇప్పటికీ యాదమరి మండలం కినాటంపల్లి అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న షికారీల దుస్థితి దయనీయంగా ఉంది.. కూడు.. గూడూ ఇప్పటికీ వారికి కరువే.. నిలువ నీడ లేదు. తినేందుకు తిండి లేదు. కట్టుకోడానికి సరైన బట్ట లేదు. పూసలమ్మితే గాని వీరికి జీవనం గడవదు. పేదరికం, నిరక్షరాస్యత వీరి వెన్నంటే ఉంటాయి.
కినాటంపల్లి అటవీ ప్రాంతంలో 54 కుటుంబాల షికారీలు నివాసం ఉంటున్నారు. వీరికి 1982లో అప్పటి ప్రభుత్వం కుటుంబాలకు నివాస స్థలాన్ని ఇచ్చింది. కొంతమంది ఇల్లు నిర్మించుకున్నారు. అవి ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. చాలా మంది ఇళ్లు లేకుండా గుడిసెల్లోనే పట్టలు కప్పుకుని ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ జీవనం సాగిస్తున్నారు. 44 మందికి మాత్రమే రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇంకా పది మంది రేషన్‌ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ గ్రామంలో 25 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి చదువుల కోసం ప్రభుత్వం పాఠశాలను ఏర్పాటు చేసింది. ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. ఒకరు ఉద్యోగ విరమణ చేయడంతో ప్రస్తుతం ఒకరు మాత్రమే ఉన్నారు. పాఠశాల రేకుల షెడ్డుగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భవనం మంజూరు చేసినా నత్తనడకనే పనులు జరుగుతున్నాయి. ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ పనులు చేద్దామా వద్దా అన్నట్లుగా కాంట్రాక్టర్‌ చేస్తున్నారు. రెండేళ్లయినా ట్యాంకు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. డ్రైనేజి, వీధిదీపాలు సైతం లేవు. సమస్యలు పరిష్కరించాలని అధికారుల దృష్టికి పలుమార్లు గ్రామస్తులు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని వారు వాపోతున్నారు. ఇళ్లు లేని వారికి జగనన్న హౌసింగ్‌లో ఇళ్లు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కనీసం వీధిలైటుల కూడా లేవని, అటవీ ప్రాంతం కావడంతో బిక్కుబిక్కుమంటూ రాత్రుల్లు గడపాల్సిందేనని వారు వాపోతున్నారు. పాఠశాల భవన నిర్మాణం, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు.
వీధిలైట్లు వేయండి : ఎంజి
షికారి కాలనీలో గతార్నెల్లుగా వీధిలైట్లు మండడం లేదు. అధికారులు దష్టికి పలుమార్లు తెలియజేసిన పట్టించుకోలేదు. రాత్రుల్లో విష సర్పాలతో ఇబ్బందులు పడుతున్నాం. వీధిలైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను అడుగుతూనే ఉన్నాం.
ఇళ్లు మంజూరు చేయాలి : సుమతి
ఇల్లు లేని వారికి జగనన్న పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలి. ఇల్లు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామంలో అందరికీ ఇల్లు మంజూరు చేసే విధంగా అధికారులు సహాయం చేయాలి.
సమస్యలు పరిష్కరిస్తాం : శివరాజ్‌, ఎంపీడీవో, యాదమరి
షికారి కాలనీలో సమస్యలు వెంటనే పరిష్కరిస్తాం. వారికి కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటాం. కాంటాక్టర్‌తో మాట్లాడి నిర్మాణ పనులు వేగవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం.