Oct 05,2023 21:25

ఆమదాలవలస : నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

* బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సూర్యారావు
* న్యాయవాదులు విధుల బహిష్కరణ
ప్రజాశక్తి - విలేకరుల యంత్రాంగం: 
కోర్టు పిటిషన్లపై రూ.20 వెల్ఫేర్‌ ఫండ్‌ స్టాంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు డిమాండ్‌ చేశారు. వెల్ఫేర్‌ ఫండ్‌ స్టాంపు అమలును నిరసిస్తూ జిల్లాలోని పలు కోర్టుల్లో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం నగరంలోని జిల్లా కోర్టు వద్ద చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బార్‌ కౌన్సిల్‌ తీసుకున్న స్టాంపు నిర్ణయం వల్ల కక్షిదారులకు న్యాయం అందుబాటులో ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం కూడా విధులను బహిష్కరించనున్నట్లు తెలిపారు.
టెక్కలిలో కోర్టు వద్ద న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. బార్‌ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని బార్‌ ఆసోసియషన్‌ అధ్యక్షులు డి.వివేకానంద డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు పేడాడ బాబూరావు, బెండి గౌరీపతి, పి.సాయిరాజ్‌, బి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆమదాలవలసలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నినాదాలు చేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కణితి విజయలక్ష్మి మాట్లాడుతూ న్యాయవాదులు రూ.20 వెల్ఫేర్‌ స్టాంప్‌ను ఎటువంటి పిటిషన్లపైనా అతికించవద్దని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయవాదులు పైడి వరాహనరసింహం, తమ్మినేని అన్నంనాయుడు, బొడ్డేపల్లి మోహనరావు, వి.రాజేశ్వరరావు, జి.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
పొందూరులోని సివిల్‌ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.
బార్‌ కౌన్సిల్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ గురువారం పొందూరు సివిల్‌ కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా రాజాం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బి.మంజుల మాట్లాడుతూ ప్రతి పిటిషన్‌పై అతికించాల్సిన స్టాంపు మొత్తాన్ని ఏకపక్షంగా పెంచడం సరికాదన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు బ్రహ్మాజీ, కిరణ్‌, రంగారావు, అశోక్‌, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.