అనంతపురం కలెక్టరేట్ :ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అర్హులైన లబ్ధిదారులకు వాటిని అందించడంలో కృషి చేస్తున్న వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం అనంతపురం కష్ణ కళామందిర్‌లో జిల్లా స్థాయి వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ అవినీతి రహితంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందిస్తున్న వాలంటీర్లను ప్రభుత్వం వజ్ర, సేవారత్న, సేవా మిత్ర పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ప్రజలకు సంక్షేమ ఫలాలు మరింత ఎక్కువగా అందించేందుకు వాలంటీర్లు కృషి చేయాలని సూచించారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ గ్రామ, వార్డు వాలంటీర్లు రానున్న కాలంలో నాయకులు ఎదగాలని ఆకాంక్షించారు. జడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ కరోనాలాంటి విపత్కర పరిస్థితులు, అకాల వర్షాల సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు మరువలేనివని చెప్పారు. ఇన్‌ఛార్జి కలెక్టర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ జిల్లాలో 10,069 మంది గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రశంసా పత్రాలతో పాటు సేవా వజ్ర పొందిన వారికి 30 వేల చొప్పున, సేవారత్న పొందిన వారికి 20 వేలు, సేవా మిత్ర పొందిన వారికి రూ.10వేల ప్రకారం రూ.10.34 కోట్ల ఆర్థిక ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందించిందని చెప్పారు. జిల్లాలో 36 మందికి సేవా వజ్ర, 199 మందికి సేవారత్న, 9834 మందికి సేవామిత్ర పురస్కారాలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ నదీమ్ అహ్మద్, రజక కార్పొరేషన్ ఛైర్మన్ మీసాల రంగన్న , రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్మన్ హరిత, సిడబ్ల్యూసి ఛైర్ పర్సన్ మేడా రామలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉమాదేవి, నగరపాలక సంస్థ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, సహాయ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్, ఆర్డీవో మధుసూదన్, జెడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, డిపిఒ ప్రభాకర్ రావు, నగర పాలక సంస్థ ఇన్‌ఛార్జి కమీషనర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










