
xప్రజాశక్తి-డుంబ్రిగూడ: మండల కేంద్రంలోని సచివాలయానికి సమీపంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభంలో ఒకే చోట రెండు మెర్క్యూరీ లైట్లతో పాటు మరో మామూలు విద్యుత్తు బల్బును అమర్చారు. కానీ వీధి దీపాలు వెలగడానికి అమర్చిన ఎంసీబీలు మరమత్తుకు గురవడంతో సుమారు నెల రోజులపాటు వీధి దీపాలు వెలగ లేదు. దీంతో మండల కేంద్రం సుమారు నెలరోజులుగా పైబడి అంధకారంలో ఉంది. మరమ్మతుకు గురైన ఎంసీబీను మార్చకుండా అధికారులు ఒకే స్తంభంలో మూడు బల్బులు ఏర్పాటు చేసినా ఎటువంటి ఉపయోగం లేదని స్థానికులు అంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండల కేంద్రం వాసులు ఆరోపిస్తున్నారు. వీధి దీపాలు వెలగక పోవడంతో రాత్రుల్లో మండల కేంద్రంలో చిమ్మ చీకటిగా ఉంటుండడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతుకు గురైన ఎంసీబీలు మరమ్మత్తు చేసి వీధి దీపాలు వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.