ప్రజాశక్తి-ఉరవకొండ నెలనెలా వేతనాలు చెల్లించకుంటే సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలు ఎలా గడవాలని సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులు ప్రశ్నించారు. పెండింగ్ వేతనాలు, పిఎఫ్, గ్రాట్యూటీ మంజూరు చేయాలని కోరుతూ సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పనిచేసే కార్మికుల సమ్మె శనివారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా పథకంలో దాదాపు 600 మంది కార్మికులు 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నారన్నారు. అయితే వారికి సకాలంలో జీతాలు, పీఎఫ్‌లు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 18 రోజులుగా కార్మికులు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. చివరిగా కార్మికులు సమ్మెలోకి వెళ్లారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రంగారెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులు, కార్మికులు










