అనంతపురం కలెక్టరేట్ : శ్రీసత్యసాయి, శ్రీరామ్‌రెడ్డి తాగునీటి సరఫరా పథకంలో పని చేస్తున్న కార్మికులకు బకాయి పడ్డ వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం అడుగడుగునా నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నాయని, ఈ పద్ధతి విడనాడి కార్మికులకు తక్షణం పెండింగ్ వేతనాలు చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీసత్యసాయి శ్రీరామిరెడ్డి కార్మికుల యూనియన్ గౌరవాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్ చేశారు. మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో శ్రీసత్యసాయి, శ్రీరామ్‌రెడ్డి తాగునీటి పథకం కార్మికులు కలెక్టరేట్ ఎదుట రిలేదీక్షలను ప్రారంభించారు. ఓబులు ముఖ్య అతిథిగా హాజరై దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ వాటర్ సప్లైరు (ఆర్‌డబ్ల్యూఎస్) శ్రీరామ్ రెడ్డి శ్రీసత్యసాయి వాటర్ స్కీములలో 20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో కార్మికులు పని చేస్తున్నారని చెప్పారు. వేలాది గ్రామాలకు సురక్షితమైన నీరు అందిస్తున్న కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. కార్మికులకు వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు. సమస్యలపై జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులకు అనేక మార్లు విన్నవించినా, దశలవారీగా నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నా స్పందన లేదన్నారు. కలెక్టర్ ఎమ్.గౌతమి స్వయంగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కార్మికులు, యూనియన్ నాయకులని చర్చలకు పిలిచి మాట్లాడారన్నారు. కార్మికుల డిమాండ్‌లను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లామని, న్యాయమైన పరిష్కారం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. నాలుగు రోజుల్లో బకాయి వేతనాలతో పాటు ధీర్ఘకాలిక సమస్యలన్నింటినీ సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కలెక్టర్ వంతు కషి చేసినప్పటికీ సంబంధిత బిల్లులు రాష్ట్ర స్థాయిలో ఆగిపోవడం విచాకరం అన్నారు. తక్షనం కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు అన్నింటినీ చెల్లించాలన్నారు. శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. పిఎఫ్, ఇఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ మాట్లాడుతూ గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్) స్కీంలలో పని చేస్తున్న వాల్, పంప్ ఆపరేటర్స్, ఎలక్ట్రిషియన్‌లు, వాచ్‌మెన్‌లు తదితర కాంట్రాక్టు కార్మికులకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. పిఎఫ్, ఇఎస్‌ఐ, గ్రాటిట్యూ తదితరం తక్షణమే చెల్లించాలని కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వారిపక్షాన సిఐటియు ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ రిలేదీక్షల్లో శ్రీసత్యసాయి కార్మికులు ఎం.వన్నూరప్ప, శ్రీనివాసులు, చిన్నరంగస్వామి, సాయి, ఎం.శంకర్, శ్రీరామ్‌రెడ్డి కార్మికులు బి.నాగరాజు, ఎం.నాగరాజు, ఆర్.ప్రకాష్, ఇ.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.










