వేటకు వెళ్లి యువకుడు మృతి
ప్రజాశక్తి -ఐరాల: మండలంలోని పొలకల పంచాయతీ జి.ఎర్రేపల్లి మిట్టూరు సమీపంలోని ఎద్దులగుట్ట దగ్గర యువకుడు మతిచెందాడని గ్రామస్తులు తెలపడంతో ఐరాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఐరాల ఎస్సై హరిప్రసాద్ మాట్లాడుతూ పొలకలపంచాయతీ ఈ మిట్టూరు గ్రామపరిధిలోగల రెవెన్యూ భూములలో ఉన్నటువంటి ఎద్దులగుట్ట సమీపంలో ఒక యువకుడు చనిపోయి ఉన్నాడని చెప్పిన సమాచారం మేరకు సోమవారం రాత్రి నుంచి పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. విచారణలో మృతుడు ఐలవారిపల్లి పంచాయతీ మొరంపల్లి పంచాయతీ కొత్తూరు ఎస్టీకాలనీకి చెందిన పి.సురేంద్ర (25)గా తెలిసిందన్నారు. మృతుని తండ్రి గతంలో మరణించగా అమ్మ, అన్నావదినలతో పాటుగా కొత్తూరులో నివాసం ఉంటూ చెంగనపల్లెలో కల్లుగీతా కార్మికుడిగా పనిచేస్తూ ఉండేవాడని పేర్కొన్నారు. శనివారం రాత్రి సుమారు 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి వాళ్ళ నానమ్మ పద్మమ్మతో వేటకు వెళుతున్నానని చెప్పి వెళ్ళాడని, ఇంటి దగ్గర నుంచి వెళ్లి తర్వాత రెండు రోజులుగా కనిపించలేదని తెలిపారు. సోమవారం సాయంత్రం మిట్టూరు గ్రామప్రజలు ఎవరో గుర్తు తెలీని వ్యక్తి చనిపోయి ఉన్నాడని తెలుపగా అతను సురేంద్రగా గుర్తించినట్లు తెలిపారు. మంగళవారం మృతుని తల్లి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి, సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేయించడం జరిగిందన్నారు. వేటకు వెళ్లిన రోజు రాత్రి జంతువులను వేటాడే క్రమంలో దగ్గర్లో ఉన్నటువంటి పవర్‌లైన్‌ని బైండింగ్ వైర్ ద్వారా కనెక్షన్ తీసుకొనే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోయినట్లు తెలిపారు. ఈవేటకు ఎప్పుడు వెళ్లారు, ఎవరెవరు వెళ్లారనే దానిపై పూర్తిగా లోతైన దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.










