ప్రజాశక్తి - భీమవరం రూరల్
భీమవరంలో వైఎస్‌ఆర్ శాఖా గ్రంథాలయంలో జిల్లా శాఖా గ్రంథాలయ అధికారుల ఉత్తర్వుల మేరకు స్వచ్ఛంద సంస్థలు విజ్ఞానవేదిక అరసవల్లి వెంకటాచారి ఛారిటబుల్ ట్రస్టు సహకార సౌజన్యంతో శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖాధికారి వెంకటరమణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. వేసవి సెలవుల్లో బాల బాలికలకు విజ్ఞాన సముపార్జన తదితర అంశాలపై ప్రభుత్వం ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఈ విషయంపై అవగాహన కల్పించాలన్నారు. వైఎస్‌ఆర్ శాఖా గ్రంథాలయం అధికారి ఎన్.వెంకటేశ్వరరావు (వెంకట్) వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం జిల్లా గ్రంథాలయ శాఖాధికారులు అందించిన ప్రణాళికను 40 రోజులు కార్యక్రమాలను వివరించారు. రంగసాయి, సుబ్రహ్మణ్యం మాట్లాడారు. కార్యక్రమంలో పిఎస్‌ఎం గరల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని ఎం.సుధారాణి, శిక్షణ శిబిర గురువులు కలిగొట్ల గోపాల శర్మ (యోగ), పద్మ (రీడింగ్), శ్యామల (చిత్రలేఖనం), ఎన్.లక్ష్మి (క్రీడలు) పాల్గొన్నారు.
పెనుమంట్ర : పిల్లలు ఫోన్‌కు అలవాటు పడి చదువుపై శ్రద్ధ చూపడం లేదని పొలమూరు మాజీ సర్పంచి చింతపల్లి రామకృష్ణ అన్నారు. డివైఎఫ్‌ఐ, ఐద్వా సహకారంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి వినోదంలో భాగంగా సోమవారం పదిలో పొలమూరు జెడ్‌పి హెచ్‌ఎస్ స్కూల్లో మొదటి, మూడు స్థానాలు సాధించిన జొన్నాడ లక్ష్మి, సత్యశ్రీ, పెంటపాటి వెంకట మాధురి, కండిబోయిన రామ్ చరణ్ గణేష్‌ను డివైఎఫ్‌ఐ, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించి సత్కరించారు. ఈ సందర్భంగా కడలి శ్రీనివాస్ మాస్టర్ పిల్లలకు కెరియర్ గైడెన్స్ మాట్లాడారు. జనవిజ్ఞాన వేదిక యూత్ కన్వీనర్ చింతపల్లి మావో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కేతా గోపాలన్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు బొంతు విజరు కుమార్, డివైఎఫ్‌ఐ నాయకులు ప్రమోద్, భారతి భరత్ , విద్యార్థులు పాల్గొన్నారు.
కాళ్ల : విద్యార్థులు చదువుతోపాటు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పి.విశ్వనాధరాజు అన్నారు. సోమవారం కోపల్లె గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని ఎంఇఒ ఎ.రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ నెల 11వ తేదీ వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని బి.సుభాషిణి, లైబ్రేరియన్ స్వరూప రాణి, స్టేట్ రిసోర్స్ పర్సన్ బిఆర్‌ఎంకె.స్వామి, ఉపాధ్యాయులు కృష్ణంరాజు, ధనశ్రీ, వెంకీనాయుడు పాల్గొన్నారు.
ఉండి:ప్రతి విద్యార్థీ పుస్తక పఠనం అలవర్చుకోవాలని యండగండి గ్రామ సర్పంచి గోగులమండ చిన్న కృష్ణమూర్తి అన్నారు. యండగండిలో శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని సోమవారం సర్పంచి చిన్న కృష్ణమూర్తి, ఉండి మండల పరిషత్ సహ ఉపాధ్యక్షురాలు దత్తాల సుజాత రాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలకు సెలవులు రావడంతో ఎక్కువ మంది విద్యార్థులు సెల్‌ఫోన్లకు బానిసలవుతున్నారన్నారు. ప్రతి విద్యార్థీ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వేగేశ్న సత్తిరాజు, గ్రంథాలయాధికారి ఎన్‌సిహెచ్ రామకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : స్థానిక ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులను సోమవారం జన విజ్ఞాన వేదిక నాయకులు ప్రత్తి వీరాస్వామి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రత్తి వీరాస్వామి, ఎన్.సల్మాన్‌రాజు, నున్నా సత్యం, ఎ.జనార్థనరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
గణపవరం : వేసవి సెలవుల్లో విద్యార్థులు తమ జ్ఞానాన్ని మరింత పెంచుకోవాడానికి ఉపయోగపడే వేసవి శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని గణపవరం సర్పంచి ఎం.అలంకారం తెలిపారు. స్థానిక గ్రంథాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపిపి సలాది రత్నదుర్గా కుమారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకురాలు జ్యోతి, గుమ్మడి సుబ్బారావు పాల్గొన్నారు.
నరసాపురం : సమ్మర్ క్యాంపు జూన్ 11వ తేదీ వరకూ జరుగుతుందని, పిల్లలు పాల్గొనాలని గ్రేడ్ వన్ లైబ్రేరియన్ కెజెఎస్‌ఎల్.కుమారి తెలిపారు. నరసాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయం వద్ద వేసవి శిక్షణ తరగతులను గ్రేడ్ వన్ లైబ్రేరియన్ కుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎం.సుధీర్‌మోహన్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ కెవి రావు పాల్గొని గ్రంథాలయ పితామహులు అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాలవేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వేసవి విజ్ఞాన శిబిరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం విద్యార్థులత భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్, సెక్రటరీ అల్లు బాబూరావు, రత్నకుమార్ పాల్గొన్నారు.
గణపవరం : పిప్పర గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరాన్ని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కాకర శ్యామ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అనంతరం వేసవి విజ్ఞాన పోస్టర్లను విడుదల చేశారు. లైబ్రేరియన్ రంగారావు మాట్లాడుతూ ఈ శిబిరం జూన్ 11వ తేదీ వరకూ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పచ్చిపులుసు గోవిందు, ఐవి.నరసింహరాజు, గుడ్ల వెంకటకృష్ణారావు పాల్గొన్నారు.
తణుకు : విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని న్యాయవాది కె.వీరరెడ్డి అన్నారు. స్థానిక పురుషుల శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి సమయాన్ని వృథా చేయకుండా బాగా చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కోసూరి గాంధీ, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వీరవాసరం :ప్రజల్లో మూడ నమ్మకాలను ప్రారదోలడంలో జన విజ్ఞాన వేదిక చేస్తున్న ప్రయత్నం ఎనలేనిదని ఎస్‌ఐ రమేష్ అన్నారు. జన విజ్ఞాన వేదిక, రీడర్స్‌ఫారం, శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి వినోదం ఉచిత శిక్షణ కార్యక్రమం వీరవాసరం శాఖా గ్రంథాలయంలో సోమవారం ప్రారంభమైంది. సర్పంచి చికిలే మంగతాయారు అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ వేసవి శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లుల శ్రీనివాసరావు, బాజంకి కృష్ణారావు, జివివి.రామానుజరావు, సబ్బారపు వెంకట్రావు, పి.హరికృష్ణ, సిహెచ్‌వి.లక్ష్మి, పి.సాయిబాబు పాల్గొన్నారు.










