వేరుశనగకు కష్టాలు..!
విత్తేందుకు రైతుల విముకత
పెరిగిన పెట్టుబడులే కారణం
సగం సాగూ నమోదు కాని వైనం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
జిల్లాలో ఖరీఫ్ అంటే ప్రధానంగా వేసేది ఒక్క వేరుశనగ మాత్రమే. ఏళ్ల తరబడి ఇది పరిపాటి. అయితే మూడేళ్లుగా దీని పరిస్థితి మారిపోతోంది. ఈ పంటను విత్తేందుకు రైతులు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈసారి వేరుశనగ పంటసాగు విస్తీర్ణం సగం కూడా కనిపించడం లేదు. ప్రధానంగా ఈపంటకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం ఒకటైతే, పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోవడం రెండోదని రైతులు చెబుతున్నారు. దీంతో వేరుశనగ మొలకలతో కళకళలాడాల్సిన పొలాలు బీడుగా దర్శనమిస్తున్నాయి.
సగం కూడా సాగు కాని వైనం
అయితే జిల్లాల విభజన తరువాత మన జిల్లాకు 55,661 హెక్టార్లలో వేరుశనగ విస్తీర్ణం నమోదువుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగా గత నెలలోనే విత్తనాలు కూడా పంపిణీ చేశారు. జూన్ మొదటి వారం నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. సాధారణంగా రైతులు జూన్ మొదటి వారం నుంచి జూలై 15వ తేదీ వరకు సాగు చేస్తుంటారు. సీజన్ ప్రారంభై 45 రోజులు గడుస్తున్నా చాలా మంది మడకలు కూడా దున్నడం లేదు. ఇక వేరుశనగ అయితే 55వేల హెకార్టకు గాను ఇప్పటి వరకు 20వేల హెక్టార్లలో మాత్రమే రైతులు విత్తనాలు విత్తారు.
భారీగా పెరిగిన పెట్టుబడులు
వేరుశనగ పంట పండించేందుకు ముందుటితో పోల్చితే క్రమంగా పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయి. భూమి దుక్కి దిన్నే దగ్గర నుంచి పంట మార్కెట్‌లో అమ్ముకునేంత వరకు పెట్టుబడులు పెట్టాల్సివస్తోంది. మధ్యలో ఎరువులు, పురుగు మందులు, రవాణా ఛార్జీలు, ట్రాక్టర్ బాడుగలు వంటి వాటికి వెచ్చించాల్సి వస్తోంది. గత ఏడాది ఒక ఎకరా సాగు చేసేందుకు రూ.25వేల వరకు అయ్యేదని, ఇప్పుడిది రూ.30వేలకు పెరిగిందని రైతులు చెబుతున్నారు. అయితే ఇందులో సగం కూడా చేతికి రావడం లేదని వారు అంటున్నారు. గత ఏడాది వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈ సారి వర్షాల జాడే లేకుండా పోతోంది.
అనుకూలించని వాతావరణం
ఇదిలా ఉంటే వేరుశనగకు పెట్టుబడి భారాలు ఒక ఎతైతే వాతావరణం కూడా సక్రమంగా అనుకూలించడం లేదు. గడిచిన పదేళ్లల్లో ఎన్నడూ రైతులకు అనుకూలంగా వాతావరణం ఉండడం లేదని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. ఒకసారి వర్షాలు లేకుండా పోయి పంట మొత్తం ఎండిపోతోందని, ఇంకో ఏడాది అధిక వర్షాలు పడి పంట మొత్తం వానల పాలవుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయని వారు అంటున్నారు. అతివృష్టి, అనావృష్టిల వల్ల రైతులకు వేరుశనగపైన పెట్టిన పెట్టుబడీ రావడం లేదని చెబుతున్నారు.
ఖర్చు పెరిగిపోయింది
నాకు రెండు ఎకరాలున్నాయి. వేరుశనగలో ఖర్చు బాగా పెరిగింది. ఎప్పుడు పంట వేసినా నష్టం వస్తోంది. ఈసారి సాగు చేయలేక పొలాన్ని బీడుగా వదిలేశా. ఇందులో వేరే పంట ఏదైనా వేసుకుందామా అని ఆలోచిస్తున్నా. - శివయ్య, రైతు










