May 05,2023 21:48

వేరుశనగ

       అనంతపురం ప్రతినిధి : వేరుశనగ విత్తనకాయల సబ్సిడీని ప్రభుత్వం ఖరారు చేసింది. సాధారణ రైతులకు 40 శాతం సబ్సిడీ ఇవ్వగా, ట్రైబల్‌ రైతులకు 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలని నిర్ణయించారు. కె-6కిలో సేకరణ ధర రూ.93 కాగా, కదిరి లేపాక్షి (కె-1812) రకం రూ.83గా నిర్ణయించింది. వీటికి 40 శాతం సబ్సిడీ ఇచ్చారు. దీని ప్రకారం కె-6కు ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ప్రకారం కిలోపైన రూ.37.20 ఇవ్వనుంది. రైతు చెల్లించాల్సింది కిలోపై రూ.55.80గా ఉంది. అదే ట్రైబల్‌ ఏజెన్సీల్లోని గిరిజన రైతులకు 90 శాతం సబ్సిడీ ప్రకారం కిలో రూ.9.30 చెల్లిస్తే సరిపోతుంది. ఇక కదిరి లేపాక్షి రకం 40 శాతం సబ్సిడీ ప్రకారం రూ.49.80 రైతు చెల్లించాలి. ట్రైబల్‌ ఏజెన్సీల్లో రైతులు 90 శాతం సబ్సడీ ప్రకారం రూ.8.30 కిలోకు చెల్లించాల్సి ఉంటుంది.
గరిష్టంగా మూడు బస్తాలు
వేరుశనగ విత్తనకాయలకు సంబంధించి 30 కిలోల ఒక బస్తా చొప్పున పంపిణీ చేయనున్నారు. అర ఎకరానికి ఒక బస్తా, ఆపైన ఒక ఎకరా వరకు అయితే రెండు బస్తాలు, ఒక ఎకరాపైన ఉన్న రైతులకు మూడు బస్తాలు గరిష్టంగా ఇస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఖరీఫ్‌లో విత్తన పంపిణీకి సంబంధించి కేటాయింపులను ప్రభుత్వం జరిపింది. అనంతపురం జిల్లాకు 78245 క్వింటాళ్ల కేటాయించారు. సత్యసాయి జిల్లాకు 100907 క్వింటాళ్లు ఖరీఫ్‌లో సబ్సిడీ విత్తనం కింద పంపిణీ చేయాలని నిర్ణయించారు.
పంపిణీ ఎప్పుడో .?
వేరుశనగ విత్తనకాయలను సాధారణంగా మే నెలలోనే పంపిణీ చేపట్టేవారు. కాని ఈసారి సేకరణ ధరయే ఇప్పుడు ఖరారైంది. ఇప్పుడు సేకరణ ప్రారంభించి ఎప్పటికి పంపిణీ జరుగుతుందన్నది చూడాల్సి ఉంది. గతంలో లాగా మన విత్తనం సొంత విత్తనం కింద కూడా రబీలో విత్తనకాయలు ఇవ్వలేదు. పూర్తిగా ప్రయివేటు వ్యాపారులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులు కూడా ముందుగా రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవడంతో నాన్‌ సబ్సిడీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత నేరుగా ఆగ్రామాలకు విత్తనకాయలను అందజేయడం జరుగుతుంది. ఇప్పటికే వర్షాలు కూడా పడుతుండటంతో రైతులు దుక్కులు దున్నుకునే పనిలో ఉన్నారు. జూన్‌ మొదటి వారంలో మరోమారు మంచి వర్షాలొస్తే విత్తనం విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు. అంతలోపు విత్తన పంపిణీ ప్రారంభమయితే రైతులు సకాలంలో విత్తనం వేసుకుంటారు.