పందిరిపై తారాజువ్వ పడి మంటలు - అదుపు చేసిన అగ్నిమాపక అధికారులు
ప్రజాశక్తి - తణుకురూరల్
తణుకు మండలం దువ్వ గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం అపశృతి చోటుచేసుకుంది. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు పందిళ్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ఆపాయం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆలయ ఇఒ పిల్లి సూర్యనారాయణ, గ్రామస్తుల వివరాలు ప్రకారం. గ్రామంలో వేణుగోపాలస్వామి ఉత్సవాలను పురస్కరించుకుని గత నెలలో ఆలయంలో తాటాకు పందిళ్లు వేశామని, దువ్వ వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో సీతారామస్వామి ఆలయం ఉందని తెలిపారు. అయితే శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో తారాజువ్వలు వేశారని అవి పందిళ్లపై పడడంతో మంటలు చెలరేగి ఉంటాయని తెలిపారు. శ్రీరామనవమి రోజు ఇటువంటి అపశృతి చోటుచేసుకోవడం గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.










