ప్రజాశక్తి - తణుకు రూరల్
తణుకు మండలం వేల్పూరు 1, 5 ఎంపిపి పాఠశాలల్లో నాడు - నేడు పనులను గురువారం జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. పాఠశాల ఆవరణ చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా ఉండడం, అవసరానికి మించి ఎక్కువ మెటీరియల్ కొనుగోలు చేయడం, పొంతన లేని సమాధానాలు చెప్పడం వంటి కారణాలకు ప్రధానోపాధ్యాయులు, ఎపిఇడబ్ల్యూ ఐడిసి ఇంజినీర్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారికి ఛార్జి మెమోలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకూ చేసిన ఖర్చులకు సంబంధించి బిల్లులు వెంటనే ఆన్‌లైన్లో అప్లోడ్ చేయాలని కలెక్టరు సూచించారు. ఎలక్ట్రికల్ సామగ్రి నిర్ణయించిన ధరలకు లోకల్‌లో కొనుగోలు చేయాలని కలెక్టరు సూచించారు. నాడు - నేడు పనుల్లో నాణ్యతలో గాని, ఖర్చుల్లో గాని వ్యత్యాసం వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నాడు- నేడు పనులు అకౌంటు బులిటీతో సీరియస్‌గా చేపట్టాలన్నారు. మిగిలిన పనులు శ్రద్ధ పెట్టి పూర్తి చేయించాలని కలెక్టరు సూచించారు. జిల్లాలో నాడు- నేడు కింద చేపట్టిన పనులు ఆర్‌అండ్‌బి అధికారులతో క్వాలిటీ చెక్ చేయించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టరు వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.వెంకటరమణ, తహశీల్దార్ పిఎన్‌డి ప్రసాద్, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ పి.శ్రీనివాస్, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఉన్నారు.










