వేలాదిమంది ప్రజానీకంతో....
కిక్కిరిసిన కలెక్టరేట్
సమస్యల పరిష్కారానికి 'సిపిఎం' రాయబారం
పవర్‌లూం కార్మికుల సమస్యపై కలెక్టర్ 'స్పందన'
ప్రజాశక్తి - చిత్తూరు ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేశామని, రాష్ట్రంలో ప్రజలు హాయిగా ఉన్నారని చెప్పడం దుర్మార్గం' అని సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు అన్నారు. గత 40 రోజులుగా సిపిఎం ఏ ఇంటికి వెళ్లినా సమస్యలు ఏకరువు పెట్టారన్నారు. 'ఇంటింటికి సిపిఎం'లో వచ్చిన సమస్యల పరిష్కారానికి సోమవారం వేలాదిమంది ప్రజానీకం 'చలో కలెక్టరేట్'కు తరలివచ్చి భారీ ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దడాల సుబ్బారావు మాట్లాడుతూ ఇంటింటి సిపిఎంలో వచ్చిన సమస్యల పరిష్కారానికి సచివాలయాలు, మండల కార్యాలయాల వద్ద ఆందోళనలు చేశామని, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద భారీ ధర్నాలు చేపట్టినట్లు చెప్పారు. స్కీం వర్కర్లకు వేతనాలు ఇస్తున్నామనే సాకుతో సంక్షేమపథకాలన్నీ రద్దు చేయడం శోచనీయమన్నారు. భూ సమస్యలు అనేకం తమ దృష్టికి వచ్చాయన్నారు. నగరి పవర్‌లూం కార్మికులకు కూలిరేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. దళితుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, దళితుల భూములు కాజేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. భూములు తీసుకున్న సందర్భంలో 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రజా ప్రతినిధులు మాటలు పక్కన పెట్టి గ్రామాల్లో తిరిగితే ప్రజల సమస్యలు తెలుస్తాయన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ సిపిఎం పోరాడుతుందన్నారు.
వాడ గంగరాజు మాట్లాడుతూ నగరి ప్రాంతంలో ఉన్న వేలాదిమంది కార్మికులకు కూలిరేట్లు పెంచాలని సమ్మె చేస్తున్నా అధికారులకు చీమకుట్టినట్లు లేదన్నారు. కుప్పం ప్రాజెక్టులో అంగన్‌వాడీలను వేధిస్తున్న సిడిపిఒపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు బకాయి బిల్లులు చెల్లించాలన్నారు. అధికారులు స్పందించని పక్షంలో భవిష్యత్‌లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీల అధీనంలో ఉన్న భూములకు పట్టాలివ్వాలని, దళితులు ఎక్కడ నివసిస్తున్నా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు. చిత్తూరు నగర కార్యదర్శి కె.సురేంద్రన్ మాట్లాడుతూ నగరంలో పేదలు నివసిస్తున్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. లెనిన్‌నగర్‌లో ఉన్న డంపింగ్‌యార్డు మార్పు చేసి వేలాదిమంది ప్రజల ఆరోగ్యాలను కాపాడాలన్నారు. శ్మశానాలు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని కాపాడాలని డిమాండ్ చేశారు. డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి అర్హులైన అందరికీ పింఛన్లు ఇవ్వాలన్నారు. 240 స్కూళ్లను విలీనం చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు చల్లా వెంకటయ్య, చైతన్య, నాయకులు ఓబుల్‌రాజు, భువనేశ్వరి, నాయకులు ఈశ్వరయ్య,చిరంజీవమ్మ, సుజని, షకీల, ప్రమీల, లలిత, పెరుమాళ్, లోకయ్య, బాలసుబ్రమణ్యం, శ్యామల పాల్గొన్నారు. వేలాదిమంది జనం పాల్గొన్నారు.
కలెక్టర్ సానుకూల స్పందన
సమస్యలపై కలెక్టర్ హరినారాయణన్ సానుకూలంగా స్పందించారు. నగరి పవర్‌లూమ కార్మికుల సమస్యలను వెంటనే రెవెన్యూ డివిజన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అంగన్‌వాడీల సమస్యలు, భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.










