వేగవంతంగా ఇంజనీరింగ్ పనులు
ఇంజనీరింగ్ పనులపై సమీక్షిస్తున్న నగర కమిషనర్
ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్ : నగరంలో ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో ఇంజనీరింగ్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కేటాయించిన నిధులకు సంబంధించిన పనులు వేగవంతంగా చేపట్టాలన్నారు. టెండర్లు పూర్తయిన పనులను త్వరగా ప్రారంభించేలా సంబంధిత గుత్తిదారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎన్‌క్యాంప్ నిధులతో చేపడుతున్న పనులు త్వరగా పూర్తి చేయించాలన్నారు. పనుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. మనబడి నాడు-నేడు పెండింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల పైనా సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ పనులు జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎంఈ గోమతి, డీఈ వెంకట ప్రసాద్, ఎఈలు పాల్గొన్నారు.










