అనంతపురం కలెక్టరేట్ : నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కింద జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, అనుకున్న సమయంలోపు వాటిని పూర్తి చేయించాలని కలెక్టర్ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురం రూరల్ పరిధిలోని కురుగుంట హౌసింగ్ లేఔట్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కురుగుంట హౌసింగ్ లేఅట్‌లో మొత్తం 863 పట్టాలు ఇవ్వగా, ఇందులో 750 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో ఆప్షన్-3 కింద కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణం డిసెంబర్ 25వ తేదీ నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. సకాలంలో నిర్మాణాలు పూర్తి చేసి ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేఅవుట్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, హౌసింగ్ డీఈ కృష్ణారావు, తహశీల్దార్ శ్రీధర్‌మూర్తి, ఆర్డీటీ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ జమీల్ అహ్మద్, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.










