
* రూ.1500 కోట్లకు విద్యుత్‌శాఖ ప్రతిపాదన
* ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్
ప్రజాశక్తి - శ్రీకాకుళం : వడ్డీ పేరుతో మరో రూ.1500 కోట్లు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాలు మోపేందుకు విద్యుత్‌శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ డిమాండ్ చేశారు. నగరంలోని సుందరయ్య భవన్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి అధ్యక్షతన ఆ పార్టీ జిల్లా విస్తత సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అధిక ధరలు, అదనపు భారాలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వడ్డీ పేరుతో మళ్లీ విద్యుత్ భారాలు వేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు, శ్లాబులు మార్చి భారాలు మోపడం, ట్రూ అప్ ఛార్జీలు, సర్‌ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, ఫిక్స్‌డ్ ఛార్జీలు, విద్యుత్ సుంకం పెంచడం, సర్దుబాటు ఛార్జీల పేర్లతో రెట్టింపు భారాన్ని ప్రజలపై వేశారని వివరించారు. బిల్లులు చెల్లించలేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, పరిశ్రమలు మూతపడుతున్నాయని, ఉపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెలా జమా ఖర్చులపై విచారణ లేకుండానే యూనిట్‌కు అదనంగా 40 పైసలు చొప్పున సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయడం దారుణమన్నారు. విద్యుత్ నియంత్రణ మండలి ప్రభుత్వం నుంచి బకాయిలు వసూలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని, ఆలస్యమైతే వడ్డీ కూడా ప్రభుత్వం నుంచి వసూలు చేయాలని తెలిపారు. వినియోగదారులపై వడ్డీ భారం వేసే ప్రతిపాదనలను తిరస్కరించాలన్నారు. ఇప్పటికే విధిస్తున్న సర్దుబాటు ఛార్జీల భారాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బహిరంగ విచారణ హైదరాబాద్‌లో కాకుండా అమరావతిలో చేయాలన్నారు. అన్ని ప్రాంతాల వారు పాల్గొనేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని తెలిపారు. విద్యుత్ శాఖ భారాల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా సిపిఎం ప్రజలను చైతన్యపరుస్తుందని, ఉద్యమాలు చేపడుతుందని చెప్పారు.
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పంటలు వేయడానికి ప్రభుత్వం సహాయం చేయాలని, బ్యాంకులు రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పతనమవుతున్నాయని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రజా ఉద్యమం రావాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ద్వారానే సామాన్యుడికి రక్షణ లభిస్తుందన్నారు. మణిపూర్ హింసకు ప్రధాని మోడీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వానికి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ల ప్రయోజనాలు తప్ప ప్రజలు ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ 80 కేజీల జీడి పిక్కల బస్తాకు రూ.16 వేల గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వమే రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఐటిడిఎను ఏర్పాటు చేయాలని, గిరిజన భూములకు రక్షణ కల్పించాలన్నారు. జిల్లాలో వంద పడక ఇఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించాలని, రిమ్స్‌ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చాలని కోరారు. కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణానికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.