తెలుగు బాణీలు పుస్తకావిష్కరణలో అంజూరు
ప్రజాశక్తి- శ్రీకాళహస్తి: శ్రీకాళ హస్తీశ్వర మహత్యం, శ్రీకాళహస్తి శతకం ద్వారా శ్రీకాళహస్తి క్షేత్ర విశిష్టతను ఖండాంతరాలకు తెలిసేలా చేసిన ధూర్జటి మహాకవి విగ్రహాన్ని పట్టణంలో వచ్చే ఉగాది నాటికి ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని ట్రస్టుబోర్డు ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ప్రముఖ రచయిత లగడపాటి భాస్కర్ రాసిన తెలుగు కలాలు-తెలుగు బాణీలు పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్యఅతిధిగా విచ్చేసిన అంజూరు మాట్లాడుతూ కవులు, రచయితల సమావేశాలకు ఒక సాహితీ నిలయం అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారంతో ఆడిటోరియాన్ని కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. అనంతరం వేదిక తరపున అంజూరు శ్రీనివాసులును అక్షర సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక కార్యదర్శి యువశ్రీ మురళి, గొడుగుచింత గోవిందయ్య, జయచంద్రరావు తీగల వెంకటయ్య, గురునాథం, రవీంద్ర, మునిసుబ్బారెఢ్డి తదితరులు పాల్గొన్నారు.










