Nov 01,2023 23:34

మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

* ఉత్తరాంధ్ర రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ
ప్రజాశక్తి- ఆమదాలవలస: 
వైసిపితోనే సామాజిక న్యాయం అందుతుందని ఉత్తరాంధ్ర వైసిపి రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ అన్నారు. పట్టణ శివారున కొర్లకోట రోడ్‌లో ఉన్న శ్రీనివాస కళ్యాణ మండపంలో శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సామాజిక సాధికారత బస్సు యాత్ర సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 7న ఆమదాలవలసలో నిర్వహించనున్న సామాజిక సాధికార బస్సు యాత్రను నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆమదాలవలస బహిరంగ కూడలిలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 9 నుంచి రాష్ట్రంలోని అన్ని సచివాలయాల కేంద్రాల్లో 'జగన్‌ ఎందుకు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు వెల్లడించారు. ఆ సచివాలయం పరిధిలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధిపొందిన లబ్ధిదారుల వివరాలతో బోర్డులను ప్రదర్శించాలన్నారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఎంపిపిలు, ఎంపటిసిలు, సర్పంచ్‌లు సమావేశమై సభను నిర్వహించి ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం ఆయా గ్రామంల్లో జండా దిమ్మకట్టి వైసిపి జెండాను ఎగురువేయాలన్నారు. అలాగే ప్రభుత్వాలు, వ్యక్తులు మాజీ సిఎం చంద్రబాబును అరెస్టు చేయలేదని, న్యాయస్థానం రిమాండ్‌ విధించిందని అన్నారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, నియోజకవర్గ పరిశీలకులు ఇందుకూరి రఘురామరాజు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, డోల జగన్‌, యువజన విభాగ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్‌, నాలుగు మండలాల జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
అయ్య వారి సేవలో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది
సుబ్బు పెళ్లి వెంకి చావుకు వచ్చిందన్నట్టు పురపాలక సంఘ సిబ్బంది తీరు ఉన్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్నుల రూపంలో వచ్చిన డబ్బులతో జీతాలు తీసుకుంటూ ఉద్యోగాలు వెలగ పెడుతున్న కొంతమంది సిబ్బంది రాజకీయ నాయకుల సేవలకు అంకితం కావడం పలు విమర్శలకు తావిస్తోంది. ఉద్యోగుల సేవలు ప్రజల చెంతకు చేరడం లేదని పలువురు వాపోతున్నారు. కొర్లకోట రోడ్డులోని శ్రీనివాస కళ్యాణ మండపంలో సామాజిక సాధికారత బస్సు యాత్ర సన్నాహక సమావేశానికి ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ బొత్స సత్యనారాయణ, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ పాల్గొన్నారు. పార్టీ సమావేశానికి మున్సిపాలిటీకి చెందిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉదయం ఎనిమిది నుంచి కళ్యాణ మండపంలో కుర్చీలు వేయడం దగ్గర నుంచి తాగునీరు, టీలు డ్రింకులు, బిస్కెట్లు వంటి సేవలన్నీ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే నిర్వహించారు. ఇది చూసిన పలువురు నివ్వెర పోవడం వారివంతయ్యింది. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌ ను వివరణ కోరగా, మంత్రులు వస్తున్న సందర్భంగా పరిసరాలు పరిశుభ్రం చేయడానికి మాత్రమే సిబ్బందిని పంపించామని,కళ్యాణ మండపంలో చేపట్టిన పనులు తన దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.