రోడ్డు పనులు ప్రారంభిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్
ప్రజాశక్తి-కళ్యాణదుర్గం వైసీపీ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధ్యమని మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. శనివారం కళ్యాణదుర్గం-ఐదుకల్లు-బసాపురం బీటీ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వివిధ గ్రామాలకు రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. 15 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న రోడ్డుకు రూ.3.5కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో కళ్యాణదుర్గం, శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.










