May 12,2023 23:19

వైసిపి కమ్ములాటలు

         అనంతపురం ప్రతినిధి : వైసిపిలో నెలకొన్న అసంతృప్తు జ్వాలలను చల్లార్చేందుకు ఆ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఇటీవల నార్పల పర్యటనకు వచ్చిన సందర్భంలో కొంతమంది నాయకులు ఎమ్మెల్యేల పనితీరుపై ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారు. నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాలు సమీక్ష జరుపుతున్నారు. శుక్రవారం నాడు దీన్ని ప్రారంభించారు. అనంతపురం రూరల్‌ మండలం పరిధిలోని నారాయణపురం గ్రామం పంచాయతీ పరిధిలోని ఒక ప్రయివేటు రిసార్ట్‌లో సమావేశాన్ని నిర్వహించారు. మొదటి రోజున రాయదుర్గం, తాడిపత్రి, ఉరవకొండ మూడు నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాల్లో ముందుగా రాయదుర్గం నియోజకవర్గం సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితోపాటు నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే, ఎపిఐఐసి ఛైర్మన్‌ మెట్టుగోవిందరెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ శిల్ప, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఉపేంద్రారెడ్డి, మాజీ ఎంపిపి రాజగోపాల్‌రెడ్డి, వైసిపి నాయకులు రాజేంద్రనాథరెడ్డి, తిమ్మప్ప, ఉష, జయరాంరెడ్డి, కేశవరెడ్డి తదితర ముఖ్య నేతలందరినీ పిలిచారు. నేతలతో విడివిడిగా మాట్లాడారు. ఇందులో ఎమ్మెల్యే పనితీరుపై కొంత మంది నేతలు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ ఆరంభం నుంచి పనిచేస్తున్న తమకు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదన్న అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏదైనా ప్రశ్నిస్తే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తానని బెదిరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. తీరు మారకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలువడం కష్టమేనని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో గెలుపోటములపై పందేలు సైతం కాస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, నాయకులు విఆర్‌.రామిరెడ్డి, పేరం నాగిరెడ్డి, పేరం స్వర్ణలత, రమేష్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, కాకర్ల రంగనాథ్‌, ఫయాజ్‌ బాషా తదితరులు సమీక్షకు హాజరైన వారిలోనున్నారు. ఈ నియోజకవర్గం రివ్యూలోనూ ఇదే తరహాలో గ్రూపుల వారీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. తమకు తగిన ప్రాధానత్య లభించడం లేదని, అందరినీ సమన్వయం చేసుకోనిపోవడం లేదని మంత్రికి విన్నవించారు. చివరగా ఉరవకొండ నియోజకవర్గం సమీక్ష జరిగింది. దీనికి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, జడ్పిటిసి, ఎంపిపిలు పాల్గొన్నారు. గ్రూపుల వారీగా సమీక్ష జరిగే ప్రాంతంలో బలప్రదర్శనలాగా జనం చేరుకున్నారు. సుమారు వెయ్యి మంది వరకు మూడు గ్రూపులుగా నేతలు తరలివచ్చారు. ఈ సమీక్షలోనూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ సమీక్షల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరి నేతలకు సమన్వయంతో నడుచుకోవాలని సూచించినట్టు సమాచారం. ఈ పార్టీ వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిదని ఆయన్ను మరోమారు ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరముందని చెప్పినట్టు తెలుస్తోంది. తేడాలొస్తే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఎవరినీ ఉపేక్షించరని హెచ్చరినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కూడా అందరు నేతలతో సమన్వయం చేసుకుని వెళ్లాలని హితవు చెప్పినట్టు సమాచారం. కింది స్థాయి నేతలతో గ్యాప్‌ లేకుండా చూసుకోవాలని సూచించారు.