ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :వైసిపి నేతల్లో సమన్వయం చేసి పార్టీని మరింత బలోపేతం చేయడానికి రెండు రోజులు నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిరాశ మిగిల్చింది. విజయసాయిరెడ్డి రాకతో ఆపార్టీ నేతల మధ్య మరింత కాక రేపింది. అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. నెల్లూరు నగరం, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో ఆపార్టీ విబేధాలు తారా స్థాయికి చేరాయి. నేతలు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉండగా, సమన్వయ కమిటీ సమావేశాలు బహిర్గతం చేశాయి. పంచాయతీ ముఖ్యమంత్రి వద్దకు చేరేలా కనిపిస్తున్నాయి.
అధికార వైసిపిలో 2024 ఎన్నికలు గుబులు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో బలమైన జిల్లాలో నెల్లూరు ఒకటి. గత ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయ డంఖా మోగించింది. ప్రజలు వైసిపిపై విశ్వాసం చూపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తమ ప్రభుత్వం అధికారంలో వస్తే బాగుంటుందని భావించారు. సర్పంచ్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి,మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో స్థానిక నేతలు పెద్ద ఎత్తున నగదు ఖర్చుపెట్టుకున్నారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. దీంతో జిల్లా వ్యాపితంగా నాయకులు, కార్యకర్తలు, ఎంఎల్‌ఎలు, సెకండరీ క్యాడర్‌నేతల మధ్య విబేధాలు పెరిగాయి. గతంలో ఎంఎల్‌ఎలతో కలిసి,మెలిసి నడిచిన నేతలంతా ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నెల్లూరు నగరం, ఉదయగిరి, కావలి, కందుకూరు నియోజకవర్గాల్లో తీవ్ర స్థాయిలో విబేధాలు కొనసాగుతున్నాయి. నెల్లూరు నగరంలో ఎంఎల్‌ఎ అనిల్‌కుమార్‌యాదవ్, రూప్‌కుమార్ యాదవ్ నాలుగేళ్ల కలిసి పనిచేశారు. ఇప్పుడు రెండు గ్రూపులుగా విడిపోయి నువ్వా, నేనా ఉన్నారు. అప్పుడప్పుడు బహిరంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరి దారిలో వారు వెళుతూ పార్టీని ఇరుకున పెడుతున్నారు. కావలి నియోజకవర్గంలో ఎంఎల్‌ఎ రామ్‌రెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సుకుమార్‌రెడ్డిలు కలిసి వ్యాపార లావాదేవీలు కొనసాగించారు. ఏడాది నుంచి ఇద్దరి మధ్య యుద్ధమే సాగుతోంది. పార్టీ నేతలు రెండుగా చీలిపోయారు. అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి వ్యతిరేకంగా ఏడుగురు నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ అంశం అనేక సార్లుపార్టీ పెద్దల దృష్టికి వెళ్లింది. రాజీ చేయాలని చూసిన సర్దుబాటు కాలేదు. కందుకూరు నియోజకవర్గంలో ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డి, ఎంఎల్‌సి మాధవరావు గ్రూపు మధ్య నువ్వా నేనా అన్నట్లు ఉంది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాల్లో వైసిపి పరిస్థితి దయనీయంగా ఉంది. వీటిని సర్దుబాటుచేసి, నేతల మధ్య సమన్వయం చేయడానికి వైసిపి అధిష్టానం ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేస్తే అది మరింత ఇబ్బందిగా మారింది.
విజయసాయిరెడ్డి రాకతో కాక..!
వైసిపిలోని విబేధాలు సర్దుబాటు చేయడానికి ఆపార్టీ నేత విజయసాయిరెడ్డి 11,12,13 మూడు రోజులు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. రెండు రోజులు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో నెల్లూరు నగరం, ఉదయగిరి, కావలి, కందుకూరు నియోజకవర్గాల్లో ఉన్న విబేధాలు ఆగ్నికి ఆజ్యం పోసినట్లు తయారైంది. ఉదయగిరి, కావలి, కందుకూరు నియోజకవర్గాల్లోని నేతలు సమావేశాల్లోనే నిరసన గళం విప్పారు. ఇరు గ్రూపులు విమర్శలు చేసుకున్నారు. నువ్వేంతంటే. నువ్వేంతంటూ గొడవలకు దిగారు. కావలి నియోజక వర్గంలో మరింత తీవ్రమైన గొడవలు సాగాయి. సిఎం వద్దే తేల్చుకుంటామంటూ ఎంఎల్‌ఎ వెళ్లిపోయి మళ్లీ వచ్చారు. గ్రామాలకు వెళ్లిన తరువాత ఆపార్టీ నేతలు, కార్యకర్తల్లో విబేధాలు పెరుగుతున్నాయి. సమావేశాల్లో ఒకరిపై ఒకరు మాట్లాడుకున్నవారు స్థానికంగా మరింత విబేధాలు పెట్టు కుంటున్నారు. నెల్లూరు నగరంలో మౌనంగానే ఎవరి పనులువారు చేసుకుంటున్నారు. ఎవరు చెప్పినా విబేధాలు తగ్గేదే లేదు అంటున్నారు. విజయసాయిరెడ్డి రాక ఆపార్టీలో సమన్వయం చేయకపోగా, విబేధాలు మరింత పెంచాయి. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని సర్దుబాటు చేస్తారా లేదా చూడాలి. నాలుగు నియోజకవర్గాల్లో వైసిపి తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటుందని ఆపార్టీనేతలే చెబుతున్నారు.










