ప్రజాశక్తి-పెనుకొండ జగన్ పని అయిపోయిందని, వైసిపి ప్రభుత్వ పతనం తథ్యమన్నారు. రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి గాలికి వదిలేసి అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా ముందుకెళ్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. బుధవారం సోమందేపల్లి సమీపంలోని నలగొండ్రాయనపల్లి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. విడిది కేంద్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గీయులతో ఆయన భేటి అయ్యారు. సోమందేపల్లి దళితవాడలో ఎస్సీ వర్గీయులతో అనంతరం మహిళలతో సమావేశమయ్యారు. స్థానిక ఎన్టీఆర్ కూడలిలో చేనేతలతో సమావేశం నిర్వహించారు. పెనుకొండ మండలం వెంకటాపురం తండాలో స్థానికులతో, పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఆర్చి వద్ద స్థానికులతో మాటామంతీ చేపట్టారు. పార్టీ నాయకులు కార్యకర్తలు మైనార్టీ సోదరులు, ప్రజలు పెద్ద ఎత్తున నారా లోకేష్‌కు స్వాగతం పలికారు. పలువురు సమస్యలతో కూడిన వినతిపత్రాలను లోకేష్‌కు అందజేశారు. అనంతరం ఎన్‌గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్‌లో వ్యాపారులతో సమావేశం జరిగింది. కురుబ సామాజిక వర్గీయులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. కరోనా కంటే డేంజరస్ వైరస్ జగన్ అని, ఈ వైరస్‌కు వ్యాక్సిన్ చంద్రబాబు నాయుడే అని పేర్కొన్నారు. జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి రావడం లేదన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని తెలిపారు. రాష్ట్రాన్ని జగన్ మోహన్‌రెడ్డి అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలనూ పెంచేసిందని అన్నారు. ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. వారు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూసే పరిస్థితి ఉందని అన్నారు. ఆంధ్రను గంజాయి కేంద్రంగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతూ వైసిపి నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. ఇసుకను దోచేస్తూ రోజుకు రూ.కోట్లు అర్జిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వ్యాపారుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ నిధులు అందజేస్తామని చెప్పారు. సమాజంలో వ్యాపారులు కూడా భాగ్యస్వాములని, వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, టిఎన్‌టియుసి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం నాయకులు, వ్యాపారులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ల విషయంలో బిసిలకు అన్యాయం
సిఎం జగన్ బీసీలకు తీరని అన్యాయం చేశారని లోకేష్ అన్నారు. రిజర్వేషన్ల విషయంలో వారికి తీరని అన్యాయం జరిగిందన్నారు. బుధవారం పెనుకొండలో కురుబ, బోయ కులస్తుల ఆత్మీయ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ.. టిడిపి హయాంలోనే బిసిలకు న్యాయం జరిగిందన్నారు. బిసిలను చట్టసభలకు పంపించిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. వారిని మంత్రులను చేసిన ఘనత కూడా టిడిపిదే అన్నారు. టిడిపిలో కష్టపడేవారికి గుర్తింపు ఉంటుందన్నారు. పేద ప్రజలను సిఎం జగన్ వెంటాడి వెంటాడి పీడిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరితాడు వేస్తున్నాడన్నారు. నాడు చంద్రబాబు వాల్మీకుల రిజర్వేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. ఆ తీర్మానానికి టిడిపి కట్టుబడి ఉందన్నారు. ఎస్టీ సోదరులకు ఇబ్బందులు లేకుండా వాల్మీకులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. కురుబలకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి నిధులను కేటాయించిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. జగన్ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందరూ ఐక్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, మాజీ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పూల నాగరాజు, మాజీ అహుడా ఛైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, కురుబ కృష్ణమూర్తి, కురుబ, వాల్మీకి సాధికార కమిటీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కురుబ, వాల్మీకి కులస్తులు పాల్గొన్నారు.










