ప్రజాశక్తి-చెన్నేకొత్తపల్లి వైసిపి ప్రభుత్వంలో బిసిలకు ఒరిగిందేమీ లేదని..జగన్ బిసిలను మాటలతో మభ్యపెడుతున్నాడని.. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం యువగళం పాదయాత్ర చెన్నేకొత్తపల్లి మండలంలోని కోన క్రాస్ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. దేవరకొండ ప్రాంతంలోని జలాశయ ముంపు రైతులతో సమావేశం నిర్వహించారు. బిసిలతో భేటి అయ్యారు. యర్రంపల్లి వద్ద జాకీ పరిశ్రమ భూ బాధితులతో సమావేశమయ్యారు. నాగసముద్రం గేటు వద్ద ఆటో డ్రైవర్లు, మెకానిక్కులతో ముచ్చడించారు. నాగసముద్రం గ్రామంలో స్థానికులతో భేటి అయ్యారు. ఉప్పరవాండ్లపల్లి కొట్టాల వద్ద సత్యసాయి నీటి సరఫరా కార్మికులతో సమావేశమయ్యారు. ప్యాదిండి గ్రామ సమీపంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. జగన్ బిసిలకు అనేక పదవులిచ్చామని చెబుతూ వారిని మాటలతో మభ్యపెడుతున్నారన్నారు. వైసిపి ప్రభుత్వంతో కింది స్థాయి బిసిలకు న్యాయం జరగలేదన్నారు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు వైసిపి ప్రభుత్వం తొలగించడంతో 16 వేల పదవులను బిసిలు కోల్పోయారన్నారు. టిడిపి స్థాపనతోనే బిసిలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసే బాధ్యతను తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని నారా లోకేష్ స్పష్టం చేశారు. బిసిలకు సంక్షేమ పథకాలను పక్కాగా అమలుచేస్తామని అన్నారు. సత్యసాయి నీటి సరఫరా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎండను సైతం లెక్క చేయకుండా తనతో పాటు పాదయాత్రను ముందుకు సాగిస్తున్న ప్రతి కార్యకర్తకూ రుణపడి ఉంటామని చెప్పారు. వైసిపి నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే అన్ని కేసులూ కొట్టివేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి సత్యసాయి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారధి, మాజీ మంత్రి పరిటాల సునీత, యువ నాయకులు పరిటాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
పరిటాల కుటుంబం ప్రజలతో మమేకమవుతుంది
మాజీ మంత్రి పరిటాల సునీత
పరిటాల కుటుంబం ప్రజలతో మమేకమవుతుందని మాజీ మంత్రి సునీత అన్నారు,. టిడిపి హయాంలో రాప్తాడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి చేపట్టకపోగా.. ఉదయం లేచినప్పటి నుండి పరిటాల కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. విమర్శలు మాని నియోజగకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మేము సైతం అంటూ పరిటాల కుటుంబం వెంట ఉన్న ప్రతి కార్యకర్తకూ సునీత ధన్యవాదాలు తెలియజేశారు.










