Apr 01,2023 22:35

మెగా చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి

ప్రజాశక్తి-గుత్తి     సిఎం జగన్మోహన్‌రెడ్డి పాలనలోనే రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక పట్టణంలోని క్రీడా మైదానంలో శనివారం మెప్మా, వెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మూడో విడత ఆసరా పథకానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. లోకేష్‌ చేపట్టిన పాదయాత్రలో ప్రజలకు మేలు చేస్తామనే హామీలను ఇవ్వకుండా సీఎంను, వైసీపీ నాయకులను దూషిస్తున్నారని చెప్పారు. లోకేష్‌ వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని అన్నారు. 40 ఏళ్లు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు టిడిపి సభల్లో జగన్మోహన్‌ రెడ్డిని నీ అంతు చూస్తా, నీ కథ చెప్తా అని సంబోధించడం ఎంతవరకు సమంజసమన్నారు. తమ ప్రభుత్వంలో 87 శాతం ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డి.వన్నూరుబీ, ఎంపీపీ జి.విశాలాక్షి, వైస్‌ చైర్‌పర్సన్‌ లు పద్మలత, వరలక్ష్మి, వైస్‌ ఎంపీపీలు తిరుపాలమ్మ, నాగేశ్వరమ్మ, వైసిపి సీనియర్‌ నాయకులు శ్రీనివాసరెడ్డి, పట్టణ మండల కన్వీనర్లు హుస్సేన్‌ పీరా, గోవర్ధన్‌రెడ్డి, జిల్లా నాయకులు క్రసర్‌ మధుసూదన్‌ రెడ్డి, బళ్లారి రాజ్‌ కుమార్‌ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు రమేష్‌ రెడ్డి, రంగస్వామి, ఎంపీడీవో చిట్రా శ్రీనివాసులు, మెప్మా అధికారిణి కెరణ్‌, వెలుగు ఏపీఎం మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.