
* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - గార : రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల వైసిపి పాలనలో వినూత్న మార్పులతో ప్రజలకు మేలు చేకూరిందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మండలంలోని దువ్వుపేటలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనంతో పాటు రూ.17.5 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను బుధవారం ప్రారంభించారు. అనంతరం అక్కడే నిర్వహించిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని రోగుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలనా వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో ప్రభుత్వ పాలనను తీసుకొచ్చామన్నారు. ప్రజలు మండల కార్యాలయాలు, పట్టణ ప్రాంతాలకు వెళ్లకుండా సొంత ఊర్లోనే పనులు చక్కదిద్దుకునేందుకు వీలు కల్పించామన్నారు. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నామని, ఇంటివద్దకే వైద్యులు వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. ఇంతకంటే పాలనలో ఇంకేం మార్పులు తీసుకురాగలమని ప్రశ్నించారు. ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి గొండు రఘురాం, డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, సర్పంచ్ గోరు అనిత, వైసిపి నాయకులు బరాటం నాగేశ్వరరావు, పీస గోపి, కొయ్యాన నాగభూషణ, ముంజేటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.