Apr 10,2023 23:02

సోదనపల్లి గ్రామ శివారులో గొర్రెల పంపెకందారులతో మాట్లాడుతున్న నారాలోకేష్‌

         శింగనమల : టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రతి సామాజిక వర్గానికి సబ్సిడీ రుణాలు అందించే చర్యలు తీసుకుంటామని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ తెలిపారు. లోకేష్‌ యువగళం పాదయాత్ర అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో సోమవారం 66వ రోజు కొనసాగింది. ఉదయం 8 గంటలకు సోదనిపల్లి క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభం అయ్యింది. పెద్దమట్లగొంది, చిన్నమట్లగొంది, సలకంచెరువు, కొరివిపల్లి, ఉల్లికల్లు గ్రామాల్లో కొనసాగింది. ఉల్లికల్లులో రాత్రికి బస చేశారు. సోదనపల్లి గ్రామ వద్ద గ్రామ శివారు వద్దకు రాగానే అక్కడ గొర్రెల పెంపకందారులు కన్పించారు. లోకేష్‌ వారివద్దకెళ్లి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దమట్లగొందిలో యాదవ సామాజికవర్గీయులతో చిన్నమట్లగొందిలో స్థానికులతో మాటామంతీ నిర్వహించారు. సలకంచెరువులో గాండ్ల, ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి నిర్వహించారు. కొరివిపల్లి ఉల్లికల్లులో స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో లోకేష్‌ మాట్లాడారు. వైసిపి అధకారంలోకి వచ్చాక కార్పొరేషన్లు ఎందుకూ పనికి రాకుండా పోయాయన్నారు. ఏ ఒక్కరికీ సబ్సిడీ రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. వైసిపి పాలనలో రాష్ట్ర అభివద్ధి 30 సంవత్సరాలు వెనక్కు వెళ్లిందన్నారు. రాబోవు రోజుల్లో రాష్ట్రం అభివద్ధి జరగాలంటే ప్రజలు టిడిపికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. టిడిపి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ముస్లిం, మైనార్టీ వర్గాల వారందరి అభివృద్ధికి చేయూతనిస్తామన్నారు. సలకం చెరువు గ్రామంలో బిసిలతో నిర్వహించిన కార్యక్రమంలో లోకేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ బాధ్యతను అధికారంలోకి రాగానే టిడిపి తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులు చదవుతున్న పుస్తకాలు చాలా ఏళ్లకాలం నాటివి, వాటిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యస్థను మారుస్మాన్నారు. విద్యలో ప్రభుత్వ, ప్రయివేటు రెండు కలగలిసి వెళ్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు. గొర్రెల పెంపకం దారులతో లోకేష్‌ మాట్లాడుతూ గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పథకాలను అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శింగనమల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండారు శ్రావణి, టూమెన్‌ కమిటీ సభ్యులు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు, టిడిపి ఎస్సీ సెల్‌ నాయకులు ఎంఎస్‌.రాజు తదితరులు పాల్గొన్నారు.