Oct 22,2023 20:52

సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్‌

* టిడిపి జిల్లా అద్యక్షులు కూన రవికుమార్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
వైసిపి ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మొదలు ఆ పార్టీ ఎమ్మెల్యేల వరకు అరాచకం సాగిస్తున్నారని, పుంగనూరు ఘటనే అందుకు నిదర్శనమన్నారు. ప్రజల స్వేచ్ఛను హరించి నిరంకుశ పాలన సాగిస్తున్నారని, పోలీసులు సైతం వారికి అండగా నిలిచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ రణస్థలం మండలం నారువకు చెందిన టిడిపి అభిమానులు శ్రీకాకుళం నుంచి కుప్పంకు చేపట్టిన సైకిల్‌యాత్రను మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు చొక్కాలు విప్పి బెదిరించడం హేయమైన చర్య అని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు చిత్తూరు వెళ్లాలంటే వీసా ఏమైనా ఉండాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బిసిలను అణగదొక్కాలని ముఖ్యమంత్రి జగన్‌ చూస్తున్నారని ఆరోపించారు. టిడిపి అభిమానులపై దాష్టీకానికి పాల్పడిన వ్యక్తులకు అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. బిసిలపై దాడి జరిగితే జిల్లాలోని బిసి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలు, దౌర్జన్యాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని బిసిలందరూ ఏకమై జగన్మోహన్‌ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎం.జె బాబు, ప్రదాన విజయరాం, సింతు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.