May 19,2023 22:11

కార్యక్రమంలో మాట్లాడుతున్న విప్‌ కాపు రామచంద్రారెడ్డి

        ప్రజాశక్తి-రాయదుర్గం   అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయమై ప్రతిపక్ష నాయకుడు, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం రాయదుర్గంలో వైసిపి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. తొలుత స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గహం నుంచి వినాయక కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాజధానిలో 50 వేల మందికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే కడుపు మండిన చంద్రబాబు నోటికొచ్చినట్లు వాగుతున్నట్లు ఆరోపించారు. ఒక సెంటు భూమిలో ఇల్లు కడతారా అని ప్రశ్నించిన చంద్రబాబు రాయదుర్గం వస్తే ఒక సెంటులో ఎంత చక్కగా ఇల్లు కట్టుకోవచ్చో చూపిస్తామన్నారు. తనను అసమర్థుడని ప్రశ్నించే కాలవ టిడిపి హయాంలో మంత్రిగా నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా ఛైర్‌పర్సన్‌ కాపు భారతి, రాయదుర్గం పురపాలక సంఘం అధ్యక్షులు పోరాలు శిల్ప, ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌యాదవ్‌, వలిబాషా, గౌని ఉపేంద్రరెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు భోజరాజు నాయక్‌, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి గోవిందు పాల్గొన్నారు.