వైఎస్సార్ విగ్రహం సురక్షితం
రోడ్డు పనుల కోసమే అక్కడి నుంచి తీశాం : కమిషనర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: వైఎస్‌ఆర్ విగ్రహం రాత్రిరాత్రే తొలగించడం.. చిత్తూరు నగరంలో వివాదాలకు తెరలేపింది. ఉన్నట్లుండి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడం పట్ల నగర పాలక సంస్థ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వైఎస్‌ఆర్ నిలువెత్తు విగ్రహాన్ని రాత్రిరాత్రే తొలగించారన్న సమాచారం సోషియల్ మీడియాలో అలజడి సృష్టించడంతో బుధవారం చిత్తూరు నగర కమిషనర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర కమిషనర్ అరుణ వైఎస్‌ఆర్ విగ్రహాన్ని తొలగించేందుకు కారణాలు తెలియజేశారు. జాతీయ రహదారి -4 విస్తరణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తీసి, సురక్షిత ప్రాంతంలో ఉంచడం జరిగిందని చెప్పారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా వై జంక్షన్ అభివద్ధి, ఆరు వరసల రహదారి, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరగవలసిన నేపథ్యంలో విగ్రహాన్ని తగిన జాగ్రత్తలతో అక్కడి నుండి తీసి సురక్షితంగా నగరపాలక సంస్థ ఆధీనంలో ఉంచడం జరిగిందన్నారు. విగ్రహాన్ని సురక్షితంగా ఉంచిన ఫోటోలను కమిషనర్ చూపించారు. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత తగిన ప్రదేశంలో విగ్రహాన్ని ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు.










