అనంతపురం కలెక్టరేట్ : వైద్యుల నిర్లక్ష్యంతో గర్భస్థ ఆడ శిశువు మృతి చెందిన సంఘటన అనంతపురం స్నేహలత ఆసుపత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఇందుకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... అనంతపురం నగరంలోని 5వ రోడ్డు నివాసం ఉంటున్న రేష్మా అనే గర్భిణి పురిటి నొప్పులతో స్నేహలత ప్రయివేట్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి చేరింది. వైద్యులు గర్భిణికి సిజేరియన్ చేసి ప్రసవం చేశారు. ఆ సమయంలో గర్భంలో ఉన్న ఆడ శిశువు శరీరానికి కత్తిగాట్లు పడి తీవ్ర రక్తస్త్రావం జరిగి శిశువు మృతి చెందింది. వైద్యులు గర్భంలోనే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులకు తెలిపారు. శిశువు శరీరంపై గాట్లు ఉండడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి వైద్యులను అడిగారు. దీనికి వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో శిశువు మృతదేహంతో ఆసుత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితులకు సిపిఎం నగర కమిటీ నాయకులు రామిరెడ్డి, వలీ, మసూద్‌లు మద్దతు తెలిపారు. ఆసుపత్రి వద్ద చేరుకుని కుటుంబ సభ్యుల పక్షాన ఆందోళన నిర్వహించారు. స్నేహలత ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారుల మరణాలు సంభవిస్తున్నాయన్నారు. తక్షణం ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఒకటవ పట్టణ సిఐ రెడ్డప్ప నేతృత్వంలో పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇదే సమయంలో గర్భస్థ శిశువు మరణం విషయం తెలుసుకున్న డిఎంఅండ్‌హెచ్‌ఒ యుగంధర్ స్నేహలత ఆసుపత్రికి చేరుకుని యాజమాన్యంతో విచారణ చేపట్టారు. బిడ్డ గర్భంలో మృతి చెందిందని, అందుకే గర్భిణికి నొప్పులు వచ్చి ఆసుపత్రిలో చేరారని డిఎంఅండ్‌హెచ్‌ఒకు తెలిపారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని సిపిఎం నాయకులు డిఎంఅండ్‌హెచ్‌ఒ దృష్టికి తీసుకెళ్లారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఘటనను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆసుపత్రి వల్ల మరొకరి ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే స్నేహలత ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఎంఅండ్‌హెచ్‌ఒ మీడియాతో మాట్లాడారు. గర్భస్థ శిశువు మరణంపై అనుమానలు ఉన్నాయని, ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.










