Oct 18,2023 20:46

స్టాల్స్‌ను తిలకిస్తున్న స్పీకర్‌ సీతారాం

* శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - సరుబుజ్జిలి: 
రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తోందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని పురుషోత్తపురంలో బుధవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో 172 రకాల మందులు, 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటింటి సర్వేలో భాగంగా పలు వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి శిబిరాలకు పంపించడమైందని, నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి తగిన మందులు ఇస్తారని చెప్పారు. వైద్య సహాయం పొందుతున్న వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఖ్యతో ఏ వైద్యుని వద్దకు వెళ్ళినా ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందని తద్వారా వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. వైద్య రికార్డు ఏర్పాటు వల్ల వివరాలు మొత్తం ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరికీ మంచి వైద్య సేవలు అందించాలని, ఎంత ఖర్చు అయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్పొరేట్‌ తరహా వైద్య సేవలను ప్రజల ముంగిటకు తెచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందని కొనియాడారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా వైద్యాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లిన ముఖ్యమంత్రి, ఆరోగ్య సురక్ష ద్వారా స్పెషలిస్ట్‌ వైద్యుల సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. ఇటువంటి గొప్ప కార్యక్రమం ఏ రాష్ట్రంలోనూ నిర్వహించడం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపిపి కె.వి.జి సత్యనారాయణ, జెడ్‌పిటిసి ఎస్‌.నాగేశ్వరరావు, వైసిపి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్‌, వైసిపి మండల అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాము వైస్‌ ఎంపిపిలు ఎల్‌.అనిల్‌ కుమార్‌, శివానందబాబు, పిఎసిఎస్‌ అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.