ప్రజాశక్తి అనంతపురం వైద్యరంగంలో ప్రమాణాలు పెరగాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టరు జయప్రకాష్ నారాయణ అన్నారు. స్థానిక మెడికల్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం వైద్య విద్యార్థుల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి అధ్యక్షతన జరిగిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ హాజరాయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వైద్య ప్రమాణాలు మెరుగుపడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. సామాన్యులకు వైద్యం చేరువయ్యేలా ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నారని దేశంలో అంత స్థాయిలో నిధులు మంజూరు లేకపోయినా ఉన్న ప్రమాణాలను సద్వినియోగం చేసుకుని నాణ్యమైన వైద్యాన్ని సామాన్య ప్రజానీకానికి చేరువ చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రయివేటు కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు పీజీ సీట్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అత్యున్నత స్థాయి ప్రమాణాలతో మరింత పటిష్ట పరచాలన్నారు. వైద్యుల నియామకాలను చేపట్టి గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యం అందించే దిశలో అడుగులు పడాలన్నారు. తల్లిదండ్రుల ఆశలను విద్యార్థుల ఆశయాలతో ముడివేసి వైద్య విద్యను పూర్తిచేసిన ప్రతి విద్యార్థికీ అభినందనలు తెలియజేశారు. 18వ స్నాతకోత్సవ కార్యక్రమంలో 93 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి డాక్టర్ దారం వెంకటేశ్వరరావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ రఘునందన్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ కెఎల్ సుబ్రహ్మణ్యం, మెడికల్ కళాశాల అకడమిక్ వైస్ ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ షారోన్ సోనియా పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.










