Apr 06,2023 20:38

శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు
ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
మహిళల్లో వచ్చే ప్రసూతి సమస్యలను గుర్తించేందుకు ఉచిత వైద్య శిబిరాలు, మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు అన్నారు. గురువారం భీమవరం పురపాలక సంఘం పరిధిలో శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో భీమవరం ఆబ్సెస్టిక్స్‌ గైనిక్‌ సొసైటీ (బోగస్సి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శాసన మండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు ప్రారంభించి మాట్లాడారు. పట్టణంలోని పేదల సేవ చేయాలనే ధృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు వినియోగించుకోవాలన్నారు. డిఆర్‌ఒ కె.కృష్ణవేణి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ రోజుల్లో కేన్సర్‌ చిన్న వయసులో కూడా వస్తోందని, కేన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేసుకోవడం ఉత్తమం అన్నారు. సంస్థ ప్రెసిడెంట్‌ పద్మావతి, ఆమె తల్లిదండ్రుల జ్ఞాపకార్థం భీమవరంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి మహిళలకు ఉచితంగా కేన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి.మహేశ్వరరావు మాట్లాడుతూ కేన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలపై ఉచిత క్యాంపు బోగిస్సి సంస్థ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డాక్టర్‌ పద్మావతి మాట్లాడుతూ 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళా స్క్రీనింగ్‌ పరీక్షలు చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. క్యేన్సర్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వివేజ్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోగిస్సీ సంస్థ సెక్రటరీ జి.సుజియశ్రీ, వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సుంకర నరసవాణి, ట్రెజరర్‌ డాక్టర్‌ రమ్య పాల్గొన్నారు.